logo

ముంపు గ్రామాల్లో సమస్యల పాఠాలు

వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ప్రజలు దుర్భర జీవనం గడుపుతున్నారు. ఏళ్లతరబడి నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదు సరికదా ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారుల చదువులకూ ఇబ్బందులు తప్పడంలేదు.

Published : 31 Jan 2023 01:51 IST

సౌకర్యాలు లేనిచోట చిన్నారుల చదువులు
- న్యూస్‌టుడే, మార్కాపురం

గొట్టిపడియలోని శిథిల పాఠశాలలో విద్యార్థులు

వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ప్రజలు దుర్భర జీవనం గడుపుతున్నారు. ఏళ్లతరబడి నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదు సరికదా ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారుల చదువులకూ ఇబ్బందులు తప్పడంలేదు. పాఠశాలలను అసౌకర్యాలు వెన్నాడుతున్నాయి. అవి శిథిలమైనా కొత్త భవనాలు లేవు. కనీస మరమ్మతులూ కరవే. నాడు-నేడు పథకం కూడా ఈ ప్రాంతాలకు వర్తింపచేయలేదు.  

మార్కాపురం మండలం గొట్టిపడియ ముంపు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 98 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడుతో పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. అయిదు తరగతి గదులకు గాను మూడే ఉన్నాయి. రెండు తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెడుతున్నారు. రెండు గదుల్లో పైకప్పు పెచ్చులు ఊడిపడి శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన తప్పడంలేదు. పాఠశాలలో గతంలో వేసిన డీప్‌బోరు నుంచి నీరు రావడంలేదు. డ్రమ్ముల్లో నిల్వ చేసుకొని వివిధ అవసరాలకు, తాగునీటికి ఉపయోగిస్తున్నారు. మరో గ్రామమైన అక్కచెరువుతండాలో 5వ తరగతి వరకు ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో రోజువారీ వచ్చేది నలుగురు మాత్రమే. ఈ పాఠశాల కూడా పూర్తిగా శిథిలమైంది.

పెద్దారవీడు మండలంలోనూ..

పెద్దారవీడు మండలంలోని ముంపు గ్రామం సుంకేసులలో ఉన్నత పాఠశాల ఉంది. ఇక్కడ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 320 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు ప్రాథమిక పాఠశాలల్లో మరో 140 మంది చిన్నారులు కనిపిస్తారు. కలనూతల ఉన్నత పాఠశాలలో 160 మంది, ప్రాథమిక పాఠశాలలో 20 మంది ఉన్నారు. గుండంచెర్ల బడి పూర్తిగా శిథిలమవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారు. సుంకేసుల ఎస్సీపాలెంలో విద్యాలయం దెబ్బతినడంతో వరండాలో చదువులు సాగుతున్నాయి. నాడు- నేడు కింద ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపిందని, వాటితో మరమ్మతులు చేయిస్తామని ఎంఈవో శ్రీనివాసులు తెలిపారు.

ముఖ హాజరుకు తిప్పలు

గొట్టిపడియ, అక్కచెరువుతండాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల ముఖ హాజరుకు సాంకేతిక ఇబ్బందులు నెలకొన్నాయి. ఉదయం, సాయంత్రం చరవాణి సిగ్నల్‌ కోసం నానా అవస్థలు పడుతున్నారు. భవనం పైకి ఎక్కి సిగ్నల్‌ కోసం వేచి చూడాల్సిందే. హాజరు కోసం పావుగంట వరకు సమయం కేటాయించాల్సి వస్తుంది. ఇక సుంకేసుల, కలనూతల, గుండంచెర్లలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు.. గ్రామాల్లో ఎవరి వద్దనైనా వైఫై ఉంటే వారి వద్దకు వెళ్లి ముఖ హాజరు తీసుకుంటున్నారు.

అక్కచెరువుతండాలో ఆరుగురు విద్యార్థులతో ఉపాధ్యాయురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని