logo

ఆ ధర మళ్లీ దక్కేనా?

జిల్లాలో పొగాకు వేలం ప్రారంభానికి బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం రైతు నాయకులు, అధికారులతో గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Published : 31 Jan 2023 01:51 IST

ఈ దఫా జిల్లాలో పెరిగిన పొగాకు సాగు
ఫిబ్రవరి 23న వేలం కేంద్రాల్లో తొలి విడత ప్రక్రియ
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే:

నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెంలో పొగాకు నాణ్యతను పరిశీలిస్తున్న బోర్డు అధికారులు

జిల్లాలో పొగాకు వేలం ప్రారంభానికి బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం రైతు నాయకులు, అధికారులతో గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. తొలివిడతగా వెల్లంపల్లి, ఒంగోలు-1, పొదిలి, కొండపి వేలం కేంద్రాల్లో ఫిబ్రవరి 23న...ఒంగోలు-2, టంగుటూరు, కనిగిరి, కందుకూరు-1, 2; కలిగిరి, డీసీపల్లి కేంద్రాల్లో మార్చి 9న కొనుగోళ్లు ప్రారంభిస్తారు. గతేడాది మార్చి 14న పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ దఫా పంట దిగుబడి పెరగనున్న నేపథ్యంలో మూడు వారాల ముందుగానే ప్రక్రియ ఉండనుంది. ఆ మధ్య పడిన వర్షాల తీవ్రత దృష్ట్యా పంట నాణ్యతతోపాటు, తూకం కూడా తగ్గనుంది. పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని అత్యధిక ధరలు ఇవ్వాలని రైతు నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

98.88 మిలియన్ల కిలోల ఉత్పత్తి..

గతేడాది మార్కెట్‌లో అన్ని రకాల పొగాకును వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేయడంతో మంచి ధరలు లభించాయి. లోగ్రేడు రకానికి సైతం రూ.150 వరకు దక్కింది. తద్వారా బ్యారన్‌కు రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చింది. కర్ణాటక సీజన్‌లో అత్యధిక వర్షాల కారణంగా పంట దిగుబడి సగానికి తగ్గింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా సీజన్‌కు మంచి గిరాకీ ఉంటుందన్న ఉద్దేశంతో జిల్లా రైతులు ఈ ఏడాది ఆరంభం నుంచే సాగు పెంచారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 57,744 హెక్టార్ల విస్తీర్ణంలో 86.82 మి.కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. 61,639 హెక్టార్లలో సాగు చేయగా, 98.88 మి.కిలోలు దిగుబడి కానున్నట్లు అంచనా.

ప్రభావం చూపిన తుపాను

డిసెంబర్‌ రెండో వారంలో మాండౌస్‌ తుపానుతో సుమారు 26 వేల హెక్టార్లలో పంట దెబ్బతింది. పాక్షికంగా పంట పోయిన చోట మళ్లీ మొక్కలు వేయగా; పూర్తిగా దెబ్బతిన్న చోట్ల ట్రాక్టర్‌తో దున్నేసి కొత్తగా సాగు చేశారు. పొగాకు బోర్డు, వ్యవసాయశాఖ నుంచి పరిహారం అందలేదు. రైతు సంక్షేమ నిధి నుంచి వడ్డీ లేని రుణం కింద కేవలం రూ.10 వేలు అందజేశారు. బ్యాంకుల నుంచి అదనపు రుణం, పంట రుణాల రీషెడ్యూల్‌ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. రైతులు ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి పెట్టుబడి పెట్టారు. యాతలు జాప్యం కావడం... ఉష్ణోగ్రతలు పెరగనున్న నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో సాగు పెరిగినా అందుకు తగ్గట్టు దిగుబడి రాదన్న ఆవేదన రైతుల్లో నెలకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని