logo

నేర వార్తలు

మండలంలోని పాకల సముద్ర తీరంలో ఆదివారం గల్లంతైన బాలుడు అబ్దుల్‌ హమీద్‌ సిద్ధిఖీ మృతదేహం లభ్యమైంది.

Published : 31 Jan 2023 01:51 IST

గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని పాకల సముద్ర తీరంలో ఆదివారం గల్లంతైన బాలుడు అబ్దుల్‌ హమీద్‌ సిద్ధిఖీ మృతదేహం లభ్యమైంది. తీరం సమీపంలోని చెల్లెమ్మగారి పట్టపుపాలెం వద్ద సోమవారం ఉదయం కనిపించిందని స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై ఫిరోజ ఫాతిమా, ఏఎస్సైలు మొహిద్దీన్‌, శేషారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. పంచనామా అనంతరం బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్లు తెలిపారు. పాకల వీఆర్వో సీతారామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.


రైలు కిందపడి యువకుడి బలవన్మరణం

శివ (పాత చిత్రం)

మార్కాపురం, న్యూస్‌టుడే: రైలు కిందపడి ఓ యువకుడు బలవన్మరణం చెందాడు. మార్కాపురం - తర్లుపాడు రైల్వేస్టేషన్ల మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్కాపురం విజయ థియేటర్‌ సమీపంలో నివాసముంటున్న ఆకుల శివ (18)... స్థానిక కూరగాయల మార్కెట్‌లో పని చేస్తుంటాడు. సోమవారం ఉదయం... పని ఉందని బయటకు వెళ్లి, నంద్యాల నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గమనించిన గూడ్స్‌ పైలట్‌ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వివరాలు సేకరించి... కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న వివరాలు తెలియరాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ హరికృష్ణారెడ్డి తెలిపారు.


ఒంగోలులో...

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒంగోలు నగరం బాలాజీనగర్‌లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. కర్రి వెంకట యశ్వంత్‌(18) అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అతని తండ్రి కోడిమాంసం దుకాణం, తల్లి అల్పాహార దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యసనాలు, చెడు స్నేహాలకు అలవాటుపడిన యశ్వంత్‌ను సమీప బంధువులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అతను ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గాలిపంకం కొక్కేనికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి తమ పనులు ముగించుకుని ఆలస్యంగా ఇంటికి చేరిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించారు. సోమవారం ఉదయం పోలీసులకు సమాచారమిచ్చారు. రెండో పట్టణ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని