logo

యువతే.. మత్తు బానిస

విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం రాకాసి కోరలకు యువకులు ఎక్కువగా చిక్కుతున్నారు. మత్తుకు బానిసలుగా మారుతూ కన్నవారిని క్షోభకు గురిచేస్తుండటంతో పాటు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

Updated : 01 Feb 2023 06:23 IST

బాధితుల్లో డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ విద్యార్థులు

చికిత్సకు జీజీహెచ్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం రాకాసి కోరలకు యువకులు ఎక్కువగా చిక్కుతున్నారు. మత్తుకు బానిసలుగా మారుతూ కన్నవారిని క్షోభకు గురిచేస్తుండటంతో పాటు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అనేక దురాగతాలకూ పాల్పడుతున్నారు. ఆరోగ్యం క్షీణించి అర్థాంతరంగా తనువు చాలిస్తున్న వారూ ఎందరో ఉంటున్నారు. మద్యపానం కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారిలో 30 ఏళ్లలోపు యువకులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2020లో అన్ని జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో వ్యసన విముక్తి కేంద్రాలను(డీ ఎడిక్షన్‌ సెంటర్లు) ప్రారంభించారు. జిల్లాకు సంబంధించి ఒంగోలు నగరంలోని సర్వజన ఆసుపత్రిలో ఇందుకుగాను ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మానసిక వ్యాధుల చికిత్సా విభాగానికి అనుబంధంగా నడుస్తున్న ఈ కేంద్రంలో ఒక వైద్యాధికారి, ముగ్గురు కౌన్సిలర్లు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఇద్దరు వార్డు సహాయకులు విధులు నిర్వహిస్తున్నారు. మద్యపానం, గంజాయి, పొగతాగడం, హెరాయిన్‌, ట్రెమడాల్‌ తదితర మత్తుమందులకు బానిసలైన వారిని వ్యసన విముక్తులను చేయడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.

కౌన్సెలింగ్‌ చేస్తున్న డాక్టర్‌ ఆదిశేషమ్మ

70 శాతం మంది 30 ఏళ్లలోపు వారే...: జీజీహెచ్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసిన తొలిరోజుల్లో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. క్రమంగా కేంద్రాన్ని ఆశ్రయించే బాధితుల సంఖ్య పెరిగింది. 2020లో 486 మంది కేంద్రం ద్వారా చికిత్స అందుకున్నారు. 2021లో ఈ సంఖ్య 1848 మందికి పెరిగింది. వీరిలో కొందరు దీర్ఘకాలం చికిత్స పొంది సాంత్వన పొందారు. ఇప్పటివరకు చికిత్స పొందిన కేసుల్లో 70 శాతం మంది 30 ఏళ్లలోపు యువకులే ఉండటం గమనార్హం. వీరిలో 40 శాతం మంది డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ చదువుతున్న యువకులూ ఉండటం ఆందోళన కలిగించే విషయం. గంజాయికి అలవాటు పడి ఆ మత్తు నుంచి బయట పడలేక పోతున్న టంగుటూరు మండలానికి చెందిన ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థి ఇటీవల కేంద్రాన్ని ఆశ్రయించారు. వ్యసనం వల్ల అప్పటికే అతని చదువుతో పాటు ఆరోగ్యం దెబ్బతింది. విషయాన్ని గుర్తించిన కౌన్సిలర్లు చికిత్సతో పాటు, కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

చివరికి తప్పు తెలుసుకుంటున్నారు...: వ్యసన విముక్తి కేంద్రంలో చికిత్స పొందుతున్న ఒంగోలు పోతురాజుపాలేనికి చెందిన వ్యక్తి మద్యం వల్ల తనకు వాటిల్లిన నష్టాన్ని తలచుకుని ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. ఇరవై ఏళ్లుగా మద్యానికి బానిసైన తాను తాగేందుకు జీవనాధారమైన పాడిగేదెలను కూడా తెగనమ్మినట్టు తెలిపారు. మితిమీరిన మద్యపానంతో కాలేయం పాడై ఆరోగ్యం క్షీణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి బతుకుపై ఆశ కలిగి ఈ కేంద్రాన్ని ఆశ్రయించినట్టు తెలిపారు. కేంద్రంలో చికిత్స పొందుతున్న వారిలో ఒక అవివాహితుడు. మద్యం వల్ల తాను చదువును మధ్యలోనే ఆపేసినట్టు చెప్పారు.

జీజీహెచ్‌లోని వ్యసన విముక్తి కేంద్రం

కళాశాలల్లో  అవగాహన సదస్సులు...

మద్యం, గంజాయి, మత్తుమందులకు బానిసలైన వారికి కౌన్సెలింగ్‌తో పాటు చికిత్స అందిస్తున్నాం. ఎక్కువ మంది ఆరోగ్యం దెబ్బతిన్నాక తాము తప్పు చేస్తున్నట్టు తెలుసుకుంటున్నారు. కొంతమంది సరదా పేరుతో తాగుతారు. మద్యం ఎంత తీసుకున్నప్పటికీ ఆరోగ్యానికి ముప్పే అనే విషయాన్ని గ్రహించాలి. ఆ వ్యసనం నుంచి విముక్తి చేయడానికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.  వ్యసనానికి తీవ్రంగా బానిసలైన వారికి ఏడాది పాటు చికిత్స అవసరం. కొద్దిరోజులు కేంద్రంలోనే ఉంచి చికిత్స చేస్తాం. ఆ తర్వాత ఇంటి వద్ద వాడుకునేందుకు మందులు ఇస్తాం. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి త్వరలో కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తాం.

డాక్టర్‌ ఆదిశేషమ్మ, మానసిక వైద్యవిభాగాధిపతి, వ్యసన విముక్తి కేంద్రం బాధ్యురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని