logo

పట్టణాలకే కందిపప్పు..!

రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల దుకాణాల ద్వారా బియ్యం కార్డుదారులకు ప్రతి నెలా సరఫరా చేసే కందిపప్పు, పంచదార పంపిణీ గత అయిదు నెలలుగా అరకొరగానే సాగుతోంది.

Published : 01 Feb 2023 01:50 IST

గ్రామీణ కోటాలో కోతలు  
అయిదు నెలలుగా అదే తగ్గింపు

రేషన్‌ దుకాణాలకు తరలించేందుకు ఒంగోలు పౌరసరఫరాల
గిడ్డంగి వద్ద కందిపప్పు బస్తాలను ట్రాక్టర్‌కు ఎత్తుతున్న కూలీలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల దుకాణాల ద్వారా బియ్యం కార్డుదారులకు ప్రతి నెలా సరఫరా చేసే కందిపప్పు, పంచదార పంపిణీ గత అయిదు నెలలుగా అరకొరగానే సాగుతోంది. ముఖ్యమైన పండగల సమయంలో కూడా బియ్యం మాత్రమే ఇవ్వడంతో కార్డుదారులు కందిపప్పు, పంచదార బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. గత రెండు నెలలుగా కందిపప్పును మూడో వంతు కుటుంబాలకే ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ఫిబ్రవరి నెలలోనూ నాలుగో వంతు కుటుంబాలకే పరిమితం కానుంది. అందులోనూ పట్టణ ప్రాంతాలకే పంపిణీలో ప్రాధాన్యం దక్కనుంది.

గిడ్డంగులకు చేరింది అరకొరే...: జిల్లాలో 6,55,525 బియ్యం కార్డులున్నాయి. ఆయా కుటుంబాలకు ప్రతి నెలా అర కిలో పంచదార, కిలో కందిపప్పుతో పాటు, మనిషికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. ప్రతి నెలా కార్డుదారులకు అందించేందుకు జిల్లాకు 655 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు అవసరం. జనవరి నెలలో 365 మెట్రిక్‌ టన్నులే కేటాయించారు. ఇవి సగం కార్డుదారులకు మాత్రమే అందాయి. ఫిబ్రవరి కోటా కింద 190 టన్నుల కందిపప్పు కేటాయించినట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందింది. అయినప్పటికీ మంగళవారం సాయంత్రం వరకు గిడ్డంగులకు 70 టన్నులు మాత్రమే నిల్వలు చేరాయి. మిగతా 120 టన్నులు బుధవారం మధ్యాహ్నానికి చేరనున్నట్లు సమాచారం.

రేషన్‌ డీలర్లకు తలనొప్పి...: డీలర్లు గ్రామాల్లో కొన్ని కుటుంబాలకే కందిపప్పు ఇస్తుండటంతో మిగిలిన వారు ప్రశ్నిస్తున్నారు. కొందరికిచ్చి మాకెందుకివ్వడం లేదంటూ కొన్ని చోట్ల వాదనకు దిగుతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని సగం మంది డీలర్లు డీడీ తీసేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో కందిపప్పును ఈ సారి తొలి విడతగా పట్టణ ప్రాంతాలకు మాత్రమే అధికారులు కేటాయిస్తున్నారు. పంచదార మాత్రం వంద శాతం కార్డుదారులకు పంపిణీ నిమిత్తం చౌకధరల దుకాణాలకు తరలించారు.

పేదలపై ఆర్థిక భారం...: బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పేదలు రేషన్‌ దుకాణాల్లో ఇచ్చే సరకుల పైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి కందిపప్పు కిలో రూ.120 వరకు పలుకుతోంది. పౌరసరఫరాల దుకాణాల ద్వారా రాయితీ పోను కిలో రూ.67కే అందిస్తున్నారు. ప్రభుత్వం రాయితీపై అందించే కందిపప్పు నెలల తరబడి అరకొరగానే పంపిణీ అవుతోంది. దీంతో విధి లేని పరిస్థితుల్లో పేదలు బయట మార్కెట్లో పెరిగిన ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఇది భారంగా మారింది. రేషన్‌ దుకాణాల ద్వారా వంద శాతం కార్డుదారులకు సరఫరా చేయాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని