logo

పద్దు... మనకెంత ప్రయోజనం దక్కు!

‘కొవిడ్‌’ పరిణామాల అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌లో రూ.45 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

Published : 02 Feb 2023 03:37 IST

‘కొవిడ్‌’ పరిణామాల అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌లో రూ.45 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అందులోని అంశాలు, వాటి ప్రభావంపై జిల్లా వాసుల్లో ఎనలేని ఆసక్తి నెలకొంది. వ్యవసాయ రంగంపై అధికంగా ఆధారపడిన జిల్లా కావడంతో ఎలాంటి ప్రోత్సాహకాలు దక్కనున్నాయోనని అన్నదాతలు ఆశించారు. రహదారులు, పథకాలు, రంగాలవారీగా ఎటువంటి ప్రయోజనాలు ఒనగూరుతాయోనని ఎదురుచూశారు. మొత్తానికి కేంద్రం ప్రవేశపెట్టిన పద్దు కొన్ని రంగాలకు ఊతమివ్వగా.. మరికొన్నింటిని విస్మరించిందనే విమర్శలు వినిపించాయి.

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు


ఔత్సాహిక మహిళలకు లబ్ధి...

దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన కింద స్వయం సహాయక సంఘాల మహిళలు చిన్నస్థాయి పరిశ్రమలు ఏర్పాటుచేసుకునేందుకు, నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయడంతో పాటు మార్కెటింగ్‌కు అవకాశాలు కల్పించేలా బడ్జెట్‌లో ప్రోత్సాహాలు ప్రకటించారు. జిల్లాలో 5.5 లక్షల మంది స్వయం సహాయ మహిళలున్నారు. వీరిలో ఔత్సాహికులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా లబ్ధి పొందనున్నారు. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ పథకంలో భాగంగా రెండేళ్లకు డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ప్రకటన కూడా మహిళకు లబ్ధి చేకూర్చనుంది.


తృణధాన్యాలకు ‘చిరు’సాయం...

గతేడాది బడ్జెట్‌లో తృణధాన్యాల సాగుకు పెద్దపీట వేసిన ఆర్థిక మంత్రి.. ఈ ఏడాది కూడా అదే పంథా కొనసాగించారు. పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు, మార్కాపురం, దర్శి, కనిగిరి తదితర ప్రాంతాల్లో జొన్న, సజ్జలు, రాగులు, కొర్రలు, అరికెలు వంటి పంటల సాగు ఎక్కువ. దాదాపు 4 వేల హెక్టార్లలో వీటిని పండిస్తుంటారు. బడ్జెట్‌లో వీటికి పెద్దపీట వేయడంతో ఆ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.


1.5 లక్షల మంది వేతన జీవులకు ఊరట...

జిల్లాలో ఆదాయ పన్ను చెల్లింపు జాబితాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు దాదాపు 1.5 లక్షల మంది వరకు ఉన్నారు. కొత్తగా ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న ఉద్యోగులకు ప్రస్తుతం రూ.5 లక్షల వరకు ఉన్న ఆదాయ పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. గతంలో ఉన్న ఆరు శ్లాబులను అయిదుకు తగ్గించారు. తద్వారా పన్ను చెల్లించే ఉద్యోగులకు కొంత ఊరట కలగనుంది. వేతనాన్ని బట్టి ఏడాదికి రూ.12 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదా కానున్నట్లు ఉద్యోగులు అంచనా వేస్తున్నారు.  


రొయ్య.. మళ్లీ మీసం మెలేసేనా..!

పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6 కోట్లు కేటాయించడం, బడ్జెట్‌లో వీటి ఉత్పత్తులు, దాణాపై పన్నుల తగ్గింపు అంశాలు ఆక్వా రైతుకు కొంత ఊరట. జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఎక్కువ. టంగుటూరు, సింగరాయకొండ, కొత్తపట్నం తదితర ప్రాంతాల్లో దాదాపు 18 వేల ఎకరాలకు పైగా ఆక్వా సాగు ఉంది. ఏటా 30 వేల టన్నుల వరకు రొయ్య ఉత్పత్తి అవుతోంది. మూడు వేల మందికి పైగా రైతులు సాగు చేస్తున్నారు. కొన్నాళ్లుగా వాతావరణ మార్పులు, ధరలు లేకపోవడం వంటి కారణాలతో ఆందోళన చెందుతున్నారు. బడ్జెట్‌లో ప్రకటనతో వీరికి కొంతైనా ప్రయోజనం చేకూరనుంది.


వీటి ఊసేదీ...

* మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపుల తగ్గింపుతో వ్యవసాయ రైతులు, కూలీలకు పనిదినాల సంఖ్య తగ్గనుంది. * రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయించినప్పటికీ జిల్లాకు సంబంధించి నూతన రైల్వే లైన్ల ప్రస్తావన, నడికుడి-శ్రీకాళహస్తి మార్గానికి సంబంధించిన ఎలాంటి ప్రకటనలు లేవు.


ఆవాసాలు పొందేందుకు కాస్త అనువు..

పీఎం ఆవాస్‌ యోజన కింద ఈసారి రూ.79 వేల కోట్లకు నిధులు పెంచారు. ఆ మేరకు జిల్లాలో పేదలు ప్రయోజనం పొందనున్నారు. గృహం కొనుగోలు చేయాలనుకునే వారికీ ఊరట లభించనుంది. జిల్లాలో
1.20 లక్షల మంది ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 68 వేల మందికి జగనన్న కాలనీల్లో పట్టాలిచ్చారు. వీరిలో కూడా సగానికి పైగా వివిధ కారణాలతో ఇళ్లు నిర్మించుకోలేక పోతున్నారు. పీఎం ఆవాస్‌ యోజన కింద జిల్లాలో 20 వేల మంది వరకు ఇళ్లను నిర్మించుకునే అవకాశాలున్నాయని అంచనా.


రహదారుల విస్తరణ ఎంత...

జాతీయ, రాష్ట్ర అంతర్గత రహదారులకు బడ్జెట్‌లో కేటాయింపులతో జిల్లా కూడా ప్రయోజనాలుంటాయా? ఉంటే ఏ మేరకు రహదారులు విస్తరించనున్నాయన్న చర్చ సాగుతోంది. జిల్లాలో నలువైపులా జాతీయ రహదారులున్నాయి. జాతీయ రహదారి 16, 544డితో పాటు వినుకొండ- గిద్దలూరు మధ్య 112 కిలోమీటర్ల, కావలి- సీతారామాపురం మధ్య 105 కిలో మీటర్ల, విజయవాడ- బెంగళూరు వయా పొదిలి, అద్దంకి మార్గంలో జాతీయ రహదారుల నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని