logo

1970లో కలిసి.. 2022లో విడిపోయి

వెనుకబాటును ప్రాతిపదికగా తీసుకుని గుంటూరు, నెల్లూరు, కర్నూలులోని మూడు ప్రాంతాలను కలిపి అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ‘ప్రకాశం’ జిల్లాగా నాడు పాలకులు ఏర్పాటు చేశారు.

Published : 02 Feb 2023 03:37 IST

మూడు ముక్కలైన ప్రకాశం 
నేడు జిల్లా అవతరణ దినోత్సవం

వెనుకబాటును ప్రాతిపదికగా తీసుకుని గుంటూరు, నెల్లూరు, కర్నూలులోని మూడు ప్రాంతాలను కలిపి అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ‘ప్రకాశం’ జిల్లాగా నాడు పాలకులు ఏర్పాటు చేశారు. ఆ లక్ష్యం నెరవేరకుండానే 2022 ఏప్రిల్‌ 4న చేపట్టిన జిల్లాల విభజనతో ఇందులోని పలు మండలాలు పొరుగునే ఉన్న నెల్లూరు, బాపట్లలో విలీనమయ్యాయి. తద్వారా జిల్లా మళ్లీ మూడు ముక్కలుగా చీలిపోయింది. జిల్లా ఏర్పాటు.. పేరు మార్పులో ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ ఆచరణలో అంతటి వెలుగులు అభివృద్ధిలో కనిపించడం లేదు. ఈ క్రమంలోనే మరో ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమైంది. జిల్లాకేంద్రం ఒంగోలులో 54వ అవతరణ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తిచేసింది.

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు- ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే

* రాష్ట్రంలో పెద్దన్నగా నిలిచి...: జిల్లాల పునర్విభజన అనంతరం 38 మండలాలతో 14,323 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో రాష్ట్రంలో అతిపెద్దదిగా ప్రకాశం అవతరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 22,88,006 మంది ఉండగా, ప్రస్తుతం సుమారు 27 లక్షల మంది ఉండొచ్చని అధికారుల అంచనా. జిల్లాలోని 38 మండలాలను ఒంగోలు(12); మార్కాపురం(13), కనిగిరి(13) డివిజన్లుగా ఏర్పాటు చేశారు. కందుకూరు నియోజకవర్గంలోని అయిదు మండలాలను నెల్లూరులో; చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లోని 13 మండలాలను కొత్తగా ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లాలో విలీనం చేశారు. పూర్వ ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ప్రస్తుతం ఎనిమిదికి పరిమితమైంది.
* 1970లో ఒంగోలు.. 1972లో ప్రకాశం...: గుంటూరు జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, చీరాల; నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కనిగిరి, దర్శి, పొదిలి; కర్నూలు జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు తాలుకాలతో 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు జిల్లాగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1972లో జిల్లాకు టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో ప్రకాశంగా నామకరణం చేశారు. జిల్లా ఏర్పడిన తొలిరోజుల్లో 4 లక్షల కుటుంబాలుండగా.. అందులో 19,19,995 మంది జనాభా ఉన్నారు. 2011 జన గణన ప్రకారం ఉమ్మడి జిల్లాలో 8,60,463 కుటుంబాలుండగా.. 33,97,448 మంది జనాభా ఉన్నారు. 2021లో మరో విడత జన గణన చేపట్టాల్సి ఉండగా.. కొవిడ్‌ దృష్ట్యా వాయిదా పడింది. అధికారుల అంచనా ప్రకారం విభజన తర్వాత జిల్లాలో సుమారు 8 లక్షల కుటుంబాలు ఉన్నట్టు అంచనా. గతంతో పోలిస్తే విద్యా వనరులు అందుబాటులోకి రావడంతో అక్షరాస్యతా శాతం 63.08 శాతానికి పెరిగింది.  


* తగ్గిన తీరం.. కళ కోల్పోయిన పర్యాటకం: ఉమ్మడి ప్రకాశంలో 10 మండలాల పరిధిలో 102 కి.మీ విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉండేది. చీరాల మండలం ఓడరేవు, వేటపాలెం మండలం రామాపురం, చినగంజాం మండలం మోటుపల్లి, కొత్తపట్నం, సింగరాయకొండ మండలం పాకల, గుడ్లూరు మండలం రామాయపట్నం బీచ్‌ల వద్ద పర్యాటకుల సందడి కనిపించేంది. జిల్లాల పునర్విభజనతో రామాయపట్నం, చీరాల, చినగంజాం, వేటపాలెం ప్రాంతాలు వేరయ్యాయి. దీంతో కోస్తా తీర ప్రాంతం 52 కి.మీకు తగ్గింది. ఇది పర్యాటక కళ తగ్గింది. ప్రస్తుతం గుండ్లకమ్మ జలాశయంతో పాటు, సీఎస్‌పురం మండలం భైరవకోన, సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ, త్రిపురాంతకం అమ్మవారి దేవస్థానం ప్రాంతాలే జిల్లాలోని పర్యాటక ప్రాంతాలుగా మిగిలాయి.


*వ్యవసాయం పైనా ప్రభావం...: ఉమ్మడి జిల్లాలో 5.82 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేయగా; అందులో ప్రధానంగా పొగాకు, శనగ, పత్తి, మిరప, వరి తదితర పంటలతో పాటు, సామాజిక వనాలైన జామాయిల్‌, సుబాబుల్‌, సరుగుడు సాగు చేస్తున్నారు. ఎన్నెస్పీ, ఏబీసీ, కృష్ణా పశ్చిమ డెల్టా కింద వరి సాగు విస్తీర్ణం బాపట్ల జిల్లా పరిధిలోకి వెళ్లింది. రాళ్లపాడు రిజర్వాయర్‌, వీఆర్‌ కోట సప్లయ్‌ ఛానల్‌ ఆయకట్టు నెల్లూరు జిల్లాలో విలీనమైంది. ప్రస్తుతం ప్రకాశంలో మొత్తం 14,32,349 హెక్టార్ల విస్తీర్ణం ఉండగా.. అందులో 31 శాతం అటవీ భూములున్నాయి. 43 శాతం సాగు భూములున్నాయి. 4,77,669 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. 3 మాధ్యమిక, 798 చిన్నపాటి చెరువులున్నాయి. సాగు, తాగునీరు అందించేందుకు జిల్లాకు కీలకంగా వెలిగొండ ప్రాజెక్ట్‌ మిగలనుంది. సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాలకు మాత్రమే ఆక్వా సాగు పరిమితమై 15 వేల ఎకరాలకు తగ్గింది.


* గెలాక్సీ మెరుపులే మిగిలాయి...: గెలాక్సీ గ్రానైట్‌కు చీమకుర్తి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచి కృష్ణపట్నం, చెన్నై ఓడరేవుల ద్వారా రాళ్లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లా వాసులతో పాటు, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. ఎగుమతుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా రూ.3 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం లభిస్తుండగా, జిల్లా గనుల శాఖకు రూ.283 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి చూపుతోంది. అనుబంధంగా వందల సంఖ్యలో పాలిషింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని అనేక మందికి ఉపాధి చూపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు