logo

లారీలపై కొండలు.. వెళ్లేదెలా ముందుకు!

గెలాక్సీపురిగా పేరొందిన చీమకుర్తి గనుల నుంచి కొందరు గ్రానైట్‌ రాళ్లను ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. పరిమితికి మించిన బరువుతో పాటు..

Published : 02 Feb 2023 03:37 IST

రాయి తగలడంతో దెబ్బతిన్న ఆర్టీసీ బస్సు.. లోపల ప్రయాణికులు

చీమకుర్తి, న్యూస్‌టుడే- ఈనాడు, ఒంగోలు: గెలాక్సీపురిగా పేరొందిన చీమకుర్తి గనుల నుంచి కొందరు గ్రానైట్‌ రాళ్లను ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. పరిమితికి మించిన బరువుతో పాటు.. లారీలకు మించిన వెడల్పుతో సాగుతున్న ఈ తరలింపు ప్రమాదకరంగా పరిణమించింది. చీమకుర్తి రామతీర్థం మధ్య బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఉదంతం ఇందుకు నిదర్శనం. పొదిలి డిపోకు చెందిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో ఒంగోలు నుంచి పొదిలి వెళ్తోంది. అదే సమయంలో లారీకి మించిన వెడల్పుతో గ్రానైట్‌ రాళ్లను తీసుకుని ఓ లారీ ఎదురుగా వస్తోంది. లారీ పక్కగా వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో బస్సును డ్రైవర్‌ పక్కకు మళ్లించడంతో గ్రానైట్‌ రాయిని వెనుక ఢీకొట్టింది. దీంతో వెనుక సీటు వద్ద ఉన్న బస్సు కిటికీ మొత్తం ఊడిపోయింది. ఈ సమయంలో అందులో కూర్చున్న ప్రయాణికుడు విషయాన్ని గుర్తించి వెంటనే పక్కకు తొలగడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. పరిమితికి మించిన రాయి కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుదని బస్సు డ్రైవర్‌ తెలిపారు. ఒంగోలు- కర్నూలు రహదారిలో ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రాళ్ల తరలింపులో వాహన చోదకులు నిబంధనలు పాటించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


బస్సు వెనుక భాగంలో తగిలిన భారీ గ్రానైట్‌ రాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని