logo

ఆన్‌లైన్‌ అక్రమాలకు పరిష్కారమెన్నడో!

భూముల అడ్డగోలు ఆన్‌లైన్‌ దందాకు అడ్డులేకుండా పోతోంది. పైసలిస్తే ఒకరి భూమి మరొకరి పేరుతో సునాయాసంగా మార్చేస్తున్నారు. స్థానికంగా నివసించని వారి భూములను ఇతరుల పేరిట ఆన్‌లైన్‌లో మార్పులు చేసి క్రయవిక్రయాలకు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు.

Published : 02 Feb 2023 03:37 IST

ఇతరుల పేరిట మార్పులు చేయడంపై బాధితుల ఆవేదన

అన్యాక్రాంతమైన వెలుగొండ కాలువ భూములివే...

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: భూముల అడ్డగోలు ఆన్‌లైన్‌ దందాకు అడ్డులేకుండా పోతోంది. పైసలిస్తే ఒకరి భూమి మరొకరి పేరుతో సునాయాసంగా మార్చేస్తున్నారు. స్థానికంగా నివసించని వారి భూములను ఇతరుల పేరిట ఆన్‌లైన్‌లో మార్పులు చేసి క్రయవిక్రయాలకు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం కనిగిరి నియోజకవర్గంలోని అనేక మండలాల్లో ఈ తరహా అక్రమాల్లో మోసపోయిన బాధితులు ఇప్పటికీ అధికారుల చుట్టూ సమస్య పరిష్కరించాలని తిరుగుతూనే ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో గతంలో పనిచేసిన కొందరు రెవెన్యూ అధికారులు భూముల అక్రమ ఆన్‌లైన్‌ దందా ద్వారా భారీగా సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


గత కలెక్టర్‌ చర్యలు తీసుకున్నా...

2021 జులై 30న ఓ పార్టీకి చెందిన వ్యక్తికి హెచ్‌ఎంపాడు మండలంలోని మహమ్మదాపురంలో అక్రమ ఆన్‌లైన్‌ చేశారని, తమ పార్టీకి చెందిన వ్యక్తికి చేయలేదని కొందరు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఆయన అప్పటి కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌కు విషయం చెప్పడంతో విచారణ చేసి అప్పటి తహసీల్దారు ఎన్‌.సుధాకరరావు, ఆర్‌ఐ పి.శివప్రసాద్‌, వీఆర్వో నరసింహులును సస్పెండ్‌ చేశారు. అయితే ఆ సమయంలో జరిగిన ఆన్‌లైన్‌ అక్రమాలను ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి పరిష్కరించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో జరిగే ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోతున్నారు. హెచ్‌ఎంపాడు మండలంలోని మహమ్మదాపురం, ఉమ్మనపల్లి, హెచ్‌ఎంపాడు, హాజీపురం, నందనవనం, వాలిచెర్ల, గొల్లపల్లి రెవెన్యూ పరిధిలోని గ్రామాల్లో ఆన్‌లైన్‌ బాధితులు ఎక్కువమంది ఉన్నారు.


వలసదారుల భూములు మాయం...

మండలంలో పనులు లేక పక్క జిల్లాలకు, తెలంగాణా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారి భూములను అధికంగా ఆన్‌లైన్‌లో మార్పులు చేశారు. అసైన్డ్‌ భూములను సైతం ఇతరుల పేరుతో మార్చేశారు. ప్రస్తుతం మండలంలో వెలిగొండ కాలువ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కొందరు వలసదారులు వచ్చి తమ పాస్‌ పుస్తకాలను పరిశీలించుకోగా అక్రమాలు వెలుగుచూశాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాకు చెందిన స్థానికేతరుల పేరిట ఎక్కువగా వీటిని మార్చారు. జరిగిన మోసం తెలియని వారు ఎప్పటికైనా వెలుగొండ ప్రాజెక్టు వస్తే తమకు లబ్ధి వస్తుందని ఎకరా రూ.2 లక్షలరే కొనుగోలు చేసేశారు.


బతుకుతెరువుకు వెళితే నా భూమి కాజేశారు...

మాది హెచ్‌ఎంపాడు గ్రామం. బతుకుతెరువు కోసం బొబ్బిలి వెళ్లాం. 30 ఏళ్ల క్రితం ఉమ్మనపల్లి రెవెన్యూలో సర్వే నం:115/2లో ప్రభుత్వం మాకు అయిదెకరాల భూమి ఇచ్చింది. దీన్ని ప్రస్తుతం ఇతరులకు ఆన్‌లైన్‌ చేశారు. ఈ విషయమైన అధికారులకు పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం కలగలేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు.

వెంకట సత్యనారాయణ, హెచ్‌ఎంపాడు


రెండేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా

మా స్వగ్రామం. ఉమ్మనపల్లి. సర్వే నం: 367/1లో నాకు అయిదెకరాల అసైన్డ్‌ భూమి ఉంది. రెండేళ్ల క్రితం ఇతరులకు ఆన్‌లైన్‌ చేశారు. నాకు పట్టాదారు పుస్తకాలు కూడా ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం తారుమారు చేసి స్థానికేతరులకు ఆన్‌లైన్‌ చేశారు. ఎన్ని అర్జీలు ఇచ్చినా ఫలితం లేదు. రెండేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా.

సయ్యద్‌ అబ్దుల్‌, ఉమ్మనపల్లి


భూ సర్వేలో సమస్యలు పరిష్కరిస్తున్నాం...

మండలంలో 27 రెవెన్యూ గ్రామాల్లో గతంలో జరిగిన ఆన్‌లైన్‌ తప్పులను భూ సర్వేలో సరిదిద్దుతున్నాం. ఇప్పటికే ఏపీ అగ్రహారం రెవెన్యూలో సర్వే పూర్తి చేశాం. అభ్యంతరాలు ఉంటే ఆయా గ్రామాల్లో సర్వే సమయంలో ఫిర్యాదు చేస్తే విచారించి నమోదు చేస్తాం. గతంలో జరిగిన అవకతవకలపై జిల్లా అధికారులకు గతంలోనే నివేదిక ఇచ్చారు. విచారణ జరుగుతోంది.

హరిబాబు, తహసీల్దారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని