logo

అమాత్యుడు చెప్పినా అతీగతీ లేదు!

గేటు కొట్టుకుపోయిన దాదాపు నెల రోజులకు... కొత్త గేటు ఏర్పాటు పనులను ఓ సంస్థకు అప్పగించారు. సదరు సంస్థ మరో గుత్తేదారుకు సబ్‌లీజుకు పనులు అప్పగించింది.

Published : 03 Feb 2023 02:05 IST

గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయి అయిదు నెలలు
నీరు నిలవక రబీ సాగుపై రైతుల ఆందోళన
న్యూస్‌టుడే - మద్దిపాడు

జలాశయం నుంచి వృథాగా పోతున్న నీరు

గేటు కొట్టుకుపోయిన దాదాపు నెల రోజులకు... కొత్త గేటు ఏర్పాటు పనులను ఓ సంస్థకు అప్పగించారు. సదరు సంస్థ మరో గుత్తేదారుకు సబ్‌లీజుకు పనులు అప్పగించింది. ఇనుప రేకులు తెచ్చి కొద్ది రోజులు పనులు చేపట్టి... తరువాత అర్ధాంతరంగా వదిలేశారు. నేటికీ కదలిక లేదు. బిల్లులు కానందునే పనులు నిలిపేశారన్న ప్రచారం జరుగుతోంది. ఆయా రేకులను పక్కన పెట్టడంతో తుప్పు పడుతున్నాయి.

గుండ్లకమ్మ జలాశయం... అటు సాగు, ఇటు తాగు నీటి పరంగా ఎంతో కీలకం. అటువంటి ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి అయిదు నెలలవుతున్నా నేటికీ కొత్తది ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాక్ష్యాత్తూ జలవనరుల శాఖా మంత్రే నెల రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పినా అతీగతీ లేదు. ఈ కారణంగా ఎగువ నుంచి జలాలు వస్తున్నా నిల్వ చేసే పరిస్థితి లేక వృథాగా దిగువకు వదిలేయాల్సి వస్తోంది. మరోవైపు రబీ సాగుపైనా నీలినీడలు నెలకొనడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

రోడ్డు పక్కన పడేయడంతో తుప్పుపట్టిన కొత్త గేటు

అన్ని విధాలా నష్టమే...

ఆగస్టు 30న రాత్రి... నిండుకుండలా ఉన్న గుండ్లకమ్మ జలాశయం మూడో నంబరు గేటు కొట్టుకుపోయింది. దీంతో వృథాగా దిగువకు పోతున్న నీటికి అడ్డుకట్ట వేసేందుకు... స్టాప్‌లాక్‌ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇతరత్రా రూపాల్లో తీసుకున్న చర్యలూ పనికిరాకుండా పోయాయి. దీనికి తోడు... మరో అయిదు గేట్ల నుంచి నీరు లీకేజీ అవుతుండడం, వాటిలోని రెండు గేట్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉండడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు భ్రదత దృష్ట్యా మొత్తం నీటిని దిగువకు విడుదల చేశారు. ఇలా మూడు టీఎంసీలకు పైగా జలాలు వృథాగా పోయాయి. ఈ క్రమంలోనే రూ.కోట్ల విలువైన మత్స్య సంపదకు నష్టం వాటిల్లి... జలాశయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మత్స్యకార కుటుంబాల జీవనోపాధిపైనా ప్రభావం చూపింది. వెంటనే నూతన గేటు ఏర్పాటు చేయడంతో పాటు... ప్రమాదకరంగా ఉన్నవాటిని యుద్ధప్రాతిపదికన పటిష్ఠం చేయాల్సి ఉన్నా యంత్రాంగం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది.

ప్రాజెక్టు దారిలో ఉన్న రేకులు

వృథాగా దిగువకు...

అప్పట్లో జలాశయాన్ని సందర్శించిన జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు... నెల రోజుల్లో నూతన గేటు అమర్చుతామని చెప్పారు. ఆయకట్టు రైతులకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకుంటామనీ హామీ ఇచ్చారు. ఆ తరువాత ఉన్నత స్థాయి అధికారులు పరిశీలించి వెళ్లారు. అయిదు నెలలు కావస్తున్నా నేటికీ గేటు ఏర్పాటు పూర్తికాలేదు. వర్షాల సమయంలో ఎగువ నుంచి పెద్ద ఎత్తున నీరు చేరినా... నిల్వ చేయలేని దుస్థితి ఉండడంతో వృథాగా దిగువకు వదిలేశారు. నేటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. అయినప్పటికీ సంబంధిత అధికారులు నిర్దిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదృష్టవశాత్తూ సాగర్‌ జలాల రాకతో ఆయకట్టు రైతులు ఖరీఫ్‌ గట్టెక్కినా... రబీ సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు పరిధిలో రబీ ఆయకట్టు అరవై వేల ఎకరాలు ఉంది. శనగ, మిర్చి, పత్తి, పెసర, బొబ్బర్లు, దాల్వా వరి ప్రధానంగా సాగవుతాయి. జలాశయం నుంచి నీరిచ్చే పరిస్థితి లేనందున రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

త్వరలోనే పూర్తి చేస్తాం... - మురళీకృష్ణ, ఈఈ

త్వరలోనే నూతన గేటు పనులు పూర్తి చేస్తాం. మిగతా గేట్ల మరమ్మతులకూ చర్యలు తీసుకుంటాం. జలాశయం సామర్థ్యం మేర నీటిని నిల్వ చేసి... ఆయకట్టు రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని