logo

అభివృద్ధి పనులతో జిల్లా ప్రగతి పథం

మహనీయుల స్ఫూర్తితో ప్రకాశం జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపిస్తామని సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు. జిల్లా 54వ అవతరణ దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు.

Updated : 03 Feb 2023 05:58 IST

ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, మేయర్‌ సుజాత తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మహనీయుల స్ఫూర్తితో ప్రకాశం జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపిస్తామని సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు. జిల్లా 54వ అవతరణ దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాదే నీరు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని.. తద్వారా జిల్లా రూపురేఖలు మారుతాయన్నారు. బెంగళూరు -కడప-విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే మూడేళ్లలో పూర్తి చేసేలా పర్యవేక్షిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రహదారుల అభివృద్ధి ద్వారా పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. నిరుద్యోగ యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి వారికి ఉపాధి మార్గాలు చూపేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ.. నాటక, సినిమా, క్రీడలు, వ్యాపార, రాజకీయ రంగాలకు ప్రకాశం జిల్లా పుట్టినిల్లన్నారు. ఇప్పటివరకు రూ.30 కోట్ల విలువైన అభివృద్ధి పనులు తాను మంజూరు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఆర్వో ఓబులేసు, మేయర్‌ గంగాడ సుజాత, డీఎస్పీ నాగరాజుతోపాటు, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఆవిర్భావం-చరిత్రను తెలిపేలా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని సత్కరించారు. ఎన్‌హెచ్‌ఎఫ్‌డీసీ కింద 22 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ.60.50 లక్షల చెక్కులను అందజేశారు. వివిధ పోటీల్లోని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తొలుత కలెక్టరేట్‌లోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 


పిల్లల క్రమశిక్షణా రాహిత్యం.. హెచ్‌ఎంలకు తాఖీదులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం భవన్‌ స్పందన హాలులో జరిగిన కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల్లో కొందరు క్రమశిక్షణ పాటించకపోవడంతో ముగ్గురు హెచ్‌ఎంలకు తాఖీదులు జారీ అయ్యాయి. వేడుకలకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం, రామనగర్‌ పాఠశాల, హెచ్‌సీఎం పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతుండగా కొంతమంది విద్యార్థులు కుర్చీలపైకి ఎక్కి చరవాణిలలో చిత్రీకరించారు. హెచ్చరించినా లక్ష్య పెట్టకుండా అల్లరి చేయడంతో వేదికపై ఉన్న జేసీ అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత డీఈవోని పిలిపించి మాట్లాడారు. విద్యార్థులను కార్యక్రమానికి పంపించినప్పుడు క్రమశిక్షణగా కూర్చోపెట్టకపోవడంపై సంబంధిత పాఠశాల హెచ్‌ఎంలను సంజాయిషీ కోరారు. దీనిపై హెచ్‌ఎంలు తమ సమాధానం అందజేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని