logo

ధాన్యం.. ధరహాసం

ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంటలో సన్న  రకాలు సాగు చేసిన కర్షకులకు ధర కలిసివస్తోంది. బహిరంగ మార్కెట్‌లో రోజు రోజుకు ధర పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది.

Published : 05 Feb 2023 04:58 IST

పోటీపడి కొనుగోళ్లు

త్రిపురాంతకంలో ధాన్యాన్ని బస్తాలకు నింపుతున్న రైతు

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంటలో సన్న  రకాలు సాగు చేసిన కర్షకులకు ధర కలిసివస్తోంది. బహిరంగ మార్కెట్‌లో రోజు రోజుకు ధర పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది.

సాగర్‌ ఆయకట్టులోని త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో 13 వేల ఎకరాల్లో వరి సాగైంది. బీపీటీని అధిక విస్తీర్ణంలో వేశారు. సన్న రకాలైనందున డిమాండ్‌ ఉండటంతో తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యాన్ని పొలాల్లోనే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. 75 కిలోల బస్తా ధాన్యం రూ.1,750కు తీసుకుంటుండటంతో రైతులకు ఇతర ఖర్చులు సైతం తప్పాయి. ధరలు పెరుగుతున్న దృష్ట్యా కొందరు నిల్వ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సన్న రకాలకు ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా ఇచ్చి వ్యాపారులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ‘ఏ’గ్రేడ్‌ ధాన్యం క్వింటాల్‌కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 ప్రకటించింది. 75 కిలోల బస్తా ‘ఏ’గ్రేడ్‌ రకానికి రూ.1545, సాధారణ గ్రేడ్‌కు రూ.1530 ఉన్నాయి. అదే బహిరంగ మార్కెట్‌లో 75 కిలోల బస్తా ధాన్యం రూ.1,600-1700 వరకు కొనుగోలు చేస్తున్నారు.

కేంద్రాలు వెల వెల

రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. ఉదాహరణకు త్రిపురాంతకం మండలంలో విశ్వనాథపురం, దూపాడు, వెల్లంపల్లి, గణపవరం, కంకణాలపల్లి.. ప్లుల్లలచెరువు మండలంలో మానేపల్లి, ఐటివరంలో ఇవి ఉన్నాయి. విశ్వనాథపురంలో 57, దూపాడు కేంద్రంలో 58, మానేపల్లిలో 165 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆర్బీకేల్లో ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో రూ.100- 200 ఎక్కువగా ఉంది. తేమ 17 శాతం, వ్యర్థాలు, నాణ్యత ప్రమాణాలు వంటి నిబంధనలు లేకుండా వచ్చిన ధాన్యం వచ్చినట్లే లారీలకు ఎత్తుతున్నారు. గోతాలు, హమాలీలు, రవాణా ప్రయాసలతో సంబంధం లేకపోవడంతో రైతులూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలకు ఆర్‌బీకేలు దూరంగా ఉన్నాయి. గణపవరానికి చెందిన రైతు తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ‘‘నాలుగెకరాల్లో బీపీటీ-5204 వరి రకం వేశాను. ఎకరాకు 35 బస్తాల దిగుబడి లభించింది. 75 కిలోల బస్తా రూ.1,650కి విక్రయించాను. ఇప్పుడు రూ.1700 ఉంది’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని