logo

ఇటు బెట్టింగులు .. అటు దొంగతనాలు

అతను పదేళ్లక్రితం పాలిటెక్నిక్‌ పూర్తి చేశాడు. హైదరాబాద్‌ వెళ్లి ఆటోకాడ్‌ కోర్సునూ పూర్తి చేసి హైదరాబాద్‌, ఒంగోలు ప్రాంతాల్లో కొన్ని ఆటోమొబైల్‌ సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు.

Published : 05 Feb 2023 04:58 IST

ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) శ్రీధర్‌రావు, చిత్రంలో ఒంగోలు డీఎస్పీ నాగరాజు,

ఒంగోలు ఒకటో పట్టణ, తాలూకా సీఐలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: అతను పదేళ్లక్రితం పాలిటెక్నిక్‌ పూర్తి చేశాడు. హైదరాబాద్‌ వెళ్లి ఆటోకాడ్‌ కోర్సునూ పూర్తి చేసి హైదరాబాద్‌, ఒంగోలు ప్రాంతాల్లో కొన్ని ఆటోమొబైల్‌ సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు. ఆ తర్వాత స్వగ్రామానికి చేరుకుని వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగులకు అలవాటుపడి అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేక్రమంలో ద్విచక్ర వాహన దొంగతనాలకు పాల్పడుతుండటంతో ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్దనుంచి రూ.3.95 లక్షల విలువైన 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) ఎస్‌.వి.శ్రీధర్‌రావు వివరాలను వెల్లడించారు. ఒంగోలు నగరంలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహన చోరీలపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు పర్యవేక్షణలో ఒకటో పట్టణ సీఐ టి.వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీహరి తమ సిబ్బందితో నిఘా పెట్టారు. స్థానిక మంగమూరురోడ్డు కళానికేతన్‌ సమీపంలో అనుమానిత యువకుడ్ని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను తన స్కూటీపై పరారవుతుండగా వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో సదరు యువకుడు టంగుటూరు మండలం మర్లపాడుకు చెందిన కొణిజేటి సాయిగా గుర్తించారు. ప్రస్తుతం మంగమూరు రోడ్డులోని మర్రిచెట్ల కాలనీలో నివాసం ఉంటూ ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడి అరెస్టు, చోరీసొత్తు రికవరీకి కృషిచేసిన అధికారులు, సిబ్బందిని అదనపు ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగరాజు, ఒంగోలు ఒకటో పట్టణ, తాలూకా సీఐలు టి.వెంకటేశ్వర్లు, వి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు