logo

మునక ప్రాంతంలో టేకు దొంగలు

వెలిగొండ ప్రాజెక్ట్‌ మునక ప్రాంతాల్లో ఉన్న విలువైన టేకు సంపద మాయమైంది. తోటలు, పొలాల గట్లపై గతంలో వందల సంఖ్యలో టేకు చెట్లు ఉండేవి.

Published : 06 Feb 2023 01:51 IST

పట్టించుకోని ప్రాజెక్ట్‌ అధికారులు  
మాయమైన సర్కారు వారి చెట్లు

అధికారులు గతంలో గుర్తు వేసిన ఓ టేకు చెట్టు

అర్థవీడు, న్యూస్‌టుడే: వెలిగొండ ప్రాజెక్ట్‌ మునక ప్రాంతాల్లో ఉన్న విలువైన టేకు సంపద మాయమైంది. తోటలు, పొలాల గట్లపై గతంలో వందల సంఖ్యలో టేకు చెట్లు ఉండేవి. ప్రస్తుతం ఇవేమీ అంతగా కనిపించడం లేదు. వాస్తవానికి పునరావాస ప్రక్రియలో భాగంగా పరిహారం అందించేందుకు గాను ముంపు ప్రాంతంలో ఉన్న టేకు చెట్లనూ అటవీ శాఖ అధికారులు గతంలో లెక్కించారు. తోటలు, పొలాల గట్లపై ఉన్న ఒక్కో చెట్టుకు అడుగుల చొప్పున సంబంధిత రైతులకు 2017లో ప్రభుత్వం పరిహారం అందించింది. అనంతరం వీటిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రాజెక్ట్‌ నీటి పారుదల అధికారులకు అప్పగించారు. నిబంధనల ప్రకారం ఈ చెట్లకు వేలం పాట నిర్వహించి ఆ నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను అధికారులు మరిచారు. ఏళ్ల తరబడి పర్యవేక్షణ కూడా లేకపోవడంతో పొలం గట్ల వెంట ఉన్న విలువైన చెట్లు ఇప్పుడు కనిపించకుండా పోయాయి. ఖరీదైన కలపగా పేరొందిన టేకును ఇలా విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ కలప విలువ రూ. లక్షలు...: అర్థవీడు మండల పరిధిలోని సాయినగర్‌, మొట్టిగొంది, లక్ష్మీపురం, కృష్ణానగర్‌ సమీప పొలాలు వెలిగొండ ప్రాజెక్ట్‌ ముంపులో ఉన్నాయి. ఈ నాలుగు గ్రామాల పరిధిలో 425 విలువైన టేకు చెట్లు ఉన్నట్టు 2018లో గుర్తించారు. మార్కాపురం గత డీఎఫ్‌వో ఖాదర్‌బాషా నేతృత్వంలో వీటి చుట్టు కొలతలను అటవీ శాఖ సిబ్బంది నమోదు చేశారు. వాటికి అప్పట్లో ఎర్ర రంగుతో సంఖ్యలు కూడా వేశారు. నిబంధనల ప్రకారం ఈ చెట్లకు వేలం నిర్వహించి వచ్చిన నగదును ప్రభుత్వ ఖాతాకు జమ చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ అయిదేళ్లుగా లేకపోయింది. అధికారుల పర్యవేక్షణ కూడా తగ్గిపోయింది. దీంతో నాణ్యమైన చెట్లన్నింటినీ గుర్తు తెలియని వ్యక్తులు నరికి అపహరించారు. ప్రస్తుతం పొలాల గట్లపై ఎండిన, సన్నటి చెట్లు తప్ప నాణ్యమైన, అప్పట్లో గుర్తించి సంఖ్యలు వేసినవీ ఒక్కటంటే ఒక్కటీ కనిపించడం లేదు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో చదరపు అడుగున్న టేకు కలప సుమారు రూ.వెయ్యి పలుకుతోంది. ఈ లెక్కన ఒకొక్క చెట్టు క్వింటాకు పైగా ఉంటుంది. అంటే రూ. లక్షల సొమ్మును ప్రభుత్వం కోల్పోయింది.

టేకు చెట్టు కొలతలు నమోదు చేసే ప్రక్రియను పర్యవేక్షిస్తున్న డీఎఫ్‌వో ఖాదర్‌బాషా (పాత చిత్రం)

చెట్ల చోరీపై పోలీసులకు ఫిర్యాదు...

టేకు చెట్ల కొనుగోలుకు మూడుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. బహిరంగ మార్కెట్‌ విలువతో కాకుండా అటవీ శాఖ విధించే కాంపోనెంట్‌ విలువతో కలపకు ధర నిర్ణయించడంతో ఆసక్తి చూపలేదు. మరోమారు అటవీ శాఖ ఆధ్వర్యంలో కొలతలు తీసి సరైన ధరలు ప్రకటించాల్సి ఉంది. కొందరు రైతులకు ఇంకా పరిహారం అందలేదు. దీంతో కొందరు రైతులు చెట్లను స్వాధీనం చేసుకోగా.. మరికొన్ని ఎండిపోయాయి. గతంలో గుర్తించిన చెట్లు కొన్ని చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాం.

రమణారెడ్డి, జేఈ, నీటి పారుదల విభాగం, వెలిగొండ ప్రాజెక్ట్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని