logo

వాలంటీర్లు ప్రచారం చేయడం లేదనే గృహ సారథులు

‘ప్రస్తుతం వాలంటీర్లు వచ్చిన తర్వాత పథకాలు ఎవరిస్తున్నారో ప్రజలకు చెప్పడంలేదు. అందుకోసమే గృహ సారథులను నియమిస్తున్నాం.

Published : 07 Feb 2023 02:54 IST

కనిగిరి ఎమ్మెల్యే బుర్రా వ్యాఖ్య

పీసీపల్లి, న్యూస్‌టుడే: ‘ప్రస్తుతం వాలంటీర్లు వచ్చిన తర్వాత పథకాలు ఎవరిస్తున్నారో ప్రజలకు చెప్పడంలేదు. అందుకోసమే గృహ సారథులను నియమిస్తున్నాం. వారు ప్రతి ఇంటికీ వెళ్లి పథకాలు వివరిస్తారు’ అంటూ కనిగిరి శాసనసభ్యుడు బుర్రా మధుసూదన్‌యాదవ్‌ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. పీసీపల్లిలోని వెలుగు కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన పార్టీ గృహ సారథుల శిక్షణ కార్యక్రమానికి బుర్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. అలాగే వెలిగండ్ల ఎంపీడీవో కార్యాలయం పైన సమావేశమందిరంలో నిర్వహించిన ఇదే తరహా కార్యక్రమంలోనూ ఆయన మాట్లాడుతూ గృహసారథులు, కన్వీనర్లు, వాలంటీర్లు సైన్యంలా పని చేసి రాబోయే ఎన్నికల్లో రెండోసారి జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. వాలంటీర్లు పూర్తిగా ప్రభుత్వం తరపున పనిచేసేవారే అయినా పార్టీ కార్యకర్తల మాదిరి వారిని భావించడం చర్చకు తావిచ్చింది. ఇక గుంటుపల్లిలో వైకాపాలోని ఇరువర్గాల మధ్య వివాదం నలుగుతుండటంతో పీసీపల్లి ఎంపీపీ కార్యాలయంలో వారితో బుర్రా సమావేశమయ్యారు. అక్కడి సచివాలయంలో పని చేస్తున్న ఓ అధికారి అసైన్‌మెంట్‌ స్థలానికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు వారు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అత్యాల జఫన్య, జట్పీటీసీ సభ్యురాలు లక్ష్మీకాంతం, వైకాపా నాయకులు బొర్రారెడ్డి, ఓకేరెడ్డి, సతీష్‌, జయరామిరెడ్డి, నరసింహం, వెంకటేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మీరు ఎస్సైకి చెప్పండి.. ఇసుక తెచ్చుకుంటాం

‘అయ్యా, ఎమ్మెల్యే గారూ మీరేమీ అనుకోనంటే ఓ మాట చెబుతాం. ఇళ్లు కట్టుకోవాలంటే అందుబాటులో ఇసుక లేదు. నెల్లూరు నుంచి తెచ్చుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాం. మీరు ఓ మాట ఎస్సై గారికి చెబితే... దగ్గరలోని వాగుల్లోంచి తెచ్చుకుంటాం.’...అని బుర్రా మధుసూదన్‌ యాదవ్‌తో పీసీపల్లి వైకాపా నాయకులు పేర్కొన్నారు. గతంలో అందుబాటులో ఉన్న ప్రాంతం నుంచి ఇసుక తెచ్చుకుని నిర్మాణాలు చేపట్టేవారమని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. వాగుల్లోంచి ఇసుక తెస్తే అధికారులు జరిమానాలు విధిస్తున్నారని తెలిపారు. పీసీపల్లికి దగ్గర్లో ఎక్కడా గుర్తింపు ఉన్న రీచ్‌ లేక... అధిక ధర వెచ్చించి నెల్లూరు నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోయారు. మీరు (ఎమ్మెల్యే)... ఎస్సై, అధికారులకు చెబితే దగ్గర్లోని వాగుల నుంచి తెచ్చుకుంటామని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని