logo

మృత్యువుతో పోరాడుతూ ఓడిన విద్యార్థిని

అనారోగ్యానికి గురైన కస్తూర్బా విద్యార్థిని చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి

Updated : 07 Feb 2023 06:42 IST

సుప్రియ

దొనకొండ, న్యూస్‌టుడే: అనారోగ్యానికి గురైన కస్తూర్బా విద్యార్థిని చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దొనకొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన విప్పర్ల సుప్రియ (15)... దొనకొండ కస్తూర్బా విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లిన బాలిక... గత నెల 23న తిరిగి విద్యాలయానికి వచ్చింది. తరువాతి రోజు వాంతులై, జ్వరం రావడంతో పాఠశాల ఏఎన్‌ఎం మందులు ఇచ్చారు. సమస్య మరింత పెరగడంతో... 27వ తేదీన బాలిక తల్లిదండ్రులకు విద్యాలయం సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు ఆమెను మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో... అదే రోజు రాత్రి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. 29న మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. వాంతులు అయిన వెంటనే విద్యాలయం సిబ్బంది సమాచారం ఇచ్చి ఉంటే తమ బిడ్డ బతికేదని తల్లిదండ్రులు వాపోయారు. ఈ విషయమై విద్యాలయం ప్రత్యేక అధికారి అరుణ మాట్లాడుతూ... ఏఎన్‌ఎం మందులు ఇచ్చాక ఆరోగ్యం బాగానే ఉందని విద్యార్థిని చెప్పడంతోనే మూడు రోజులు ఉంచామన్నారు. పరిస్థితి మెరుగు పడకపోవటంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామన్నారు. బాలిక మృతి విషయమై స్టేషన్‌కు సమాచారం వచ్చిందని... ఘటపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్సై సైదుబాబు తెలిపారు.


ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడి మృతి

కొండపి, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నెన్నూరుపాడుకు చెందిన కొలకలూరి ప్రవీణ్‌ (21) అనే యువకుడు... ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బజారుకు వెళ్లాడు. స్థానిక సెల్‌టవర్‌ సమీపంలో అదుపు తప్పి పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. కుటుంబీకులు అతడిని మొదట కొండపి వైద్యశాలకు, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఇలా మృతువాత పడడంతో తల్లిదండ్రులు ఏసురత్నం, ఏసమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు.

రైలు కిందపడి ఆత్మహత్య : ఒంగోలు నేరవిభాగం: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒంగోలు స్టేషన్‌కు దక్షిణం వైపున చోటుచేసుకుంది. సుమారు 30 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని యువకుడు రామ్‌నగర్‌ ఆరోలైను సమీపంలో రైలు కిందపడి మృతి చెందాడు. సోమవారం ఉదయం రైల్వే సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి ఒంగోలు జీఆర్‌పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడ్ని గుర్తించేందుకు సంఘటనాస్థలంలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్‌ శవాగారంలో భద్రపరిచారు. జీఆర్‌పీ ఏఎస్సై ఎ.నర్సింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని