logo

360 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి... కొండపిలో అక్రమంగా నిల్వ చేసిన 360 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Updated : 07 Feb 2023 06:38 IST

స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలతో అధికారులు

కొండపి, న్యూస్‌టుడే: విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి... కొండపిలో అక్రమంగా నిల్వ చేసిన 360 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు విజిలెన్స్‌ డీఎస్పీ అశోక్‌వర్దన్‌ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పొదిలి రోడ్డులోని ఓ రైస్‌మిల్లు సమీప గోదాములో అక్రమార్కులు 310 బస్తాల రేషన్‌ బియ్యాన్ని నిల్వచేశారు. మండలంలోని పలు చౌక దుకాణాల నుంచి వీటిని సేకరించి... ప్లాస్టిక్‌ గోతాల్లోకి మార్చి తరలించేందుకు సిద్ధం చేశారు. ఇవికాకుండా మరో 50 బస్తాలకు పైగా బియ్యాన్ని ఆటోలో అదే గోదాముకు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సదరు ఆటోను వెంబడించి... గోదాము వద్ద దించుతుండగా దాడి చేసి పట్టుకున్నారు. వీటితో పాటు,    గోదాములో నిల్వ చేసిన మొత్తం బియ్యాన్ని జప్తు చేసి...  సింగరాయకొండ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్న వంకాయలపాటి అశోక్‌ అనే వ్యక్తితో పాటు... ఆటో, చోదకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. గోదాము ఆవణలో సుమారు ముప్పై రేషన్‌ బియ్యం సంచులను గుర్తించామన్నారు. ఎక్కడెక్కడి నుంచి బియ్యం సేకరించారన్న వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. దాడిలో సీఐ సుబ్బారావు, ఎస్సై నాగేశ్వరరావు, తహసీల్దార్‌ శామ్యూల్‌పాల్‌, డీటీ రామకృష్ణ., హెడ్‌ కానిస్టేబుల్‌ రవి, కానిస్టేబుళ్లు, సురేష్‌, చిన్నికృష్ణ   పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని