logo

‘పరిహారం సంతృప్తికరంగా లేదు’

గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి ప్రభుత్వం అందించే పరిహారం సంతృప్తికరంగా లేదని మాచవరం, చినఅలవలపాడు, పోలవరం తదితర గ్రామాల రైతులు తెలిపారు.

Updated : 08 Feb 2023 06:18 IST

మాట్లాడుతున్న ఆర్డీవో కె. సందీప్‌కుమార్‌

కనిగిరి, న్యూస్‌టుడే: గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి ప్రభుత్వం అందించే పరిహారం సంతృప్తికరంగా లేదని మాచవరం, చినఅలవలపాడు, పోలవరం తదితర గ్రామాల రైతులు తెలిపారు. మంగళవారం ఆర్డీవో సందీప్‌ కుమార్‌ మాచవరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ధరకు రెండింతలు చేసి ప్రభుత్వం ఎకరాకు రూ.11.35 లక్షల వరకు పరిహారాన్ని ప్రకటించిందని, ఆ మొత్తాన్ని తీసుకోవాలని కోరారు. రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడ ఎకరా రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ధర పలుకుతోందని, ఆ మేరకు చెల్లిస్తేనే భూములు ఇస్తామని చెప్పారు. ఆర్డీవో జోక్యం చేసుకుని ప్రాజెక్టు రావాలంటే అందరూ సహకరించాలని, లేకుంటే ప్రభుత్వం ఇష్ట ప్రకారం పరిహారం చెల్లింపులు జరుగుతాయన్నారు. తాను కేవలం ప్రభుత్వం చెప్పిన విషయం తెలిపేందుకు ఇక్కడకు వచ్చానన్నారు. పరిహారం విషయంలో సంతృప్తి చెందని రైతులు చివరకు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి భూములు ఇవ్వమని తెగేసి చెప్పారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని, ఎవరు సంతకాలు పెట్టమంని తీర్మానం చేశారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వి.పుల్లారావు, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని