logo

గిరిజనులకు పథకాలు చేరువయ్యేలా చర్యలు‌

గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు ఆదేశించారు.

Published : 08 Feb 2023 03:01 IST

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ రవిబాబు

దిగువమెట్ట ఎరుకలకాలనీలో బుట్టలు అల్లుతున్న వృద్ధునితో మాట్లాడుతున్న రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ డా.కె.రవిబాబు, సభ్యులు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు ఆదేశించారు. ఆయనతో పాటు కమిషన్‌ సభ్యులు మంగళవారం ఉదయం గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామంలోని ఎరుకలకాలనీ, చెంచుకాలనీలను సందర్శించారు. దిగువమెట్ట రైల్వేస్టేషన్‌ ఆవల 18 ఎస్టీ కుటుంబాలు ఉన్నప్పటికీ వారికి మౌలిక వసతులు ఎందుకు కల్పించలేకపోయారని అధికారులను ప్రశ్నించారు. చెంచుకాలనీలో సుమారు 72 మంది చిన్నారులు ఉన్నా పాఠశాలకు కేవలం 8 మంది మాత్రమే వస్తున్నారని, మిగతావారు ఆధార్‌, జనన ధ్రువీకరణ పత్రాలు లేక రాలేకపోతున్నట్లు తెలిసిందన్నారు. వాటిని ఎందుకు అందించలేకపోయారంటూ అధికారులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. రాచర్ల మండలం జేపీ చెరువులోని అంబచెరువు ప్రాంతంలో తాము నివాసముంటున్నామని, గతంలో తమకు కేటాయించిన స్థలాలు నేటికీ అప్పగించలేదని చెంచులక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేశారు. రాచర్ల మండల రెవెన్యూ అధికారులకు ఎస్టీ కమిషన్‌ ద్వారా సమన్లు జారీ చేస్తామని రవిబాబు అన్నారు. మండల ప్రాథమిక వివరాలు లేకుండా ఎలా వచ్చారంటూ తహసీల్దార్‌, ఎంఈవో, గృహనిర్మాణశాఖ అధికారులను ప్రశ్నించారు. దిగువమెట్టలో కొన్నేళ్లుగా అడవిలో వెదురు బొంగులు సేకరించి జీవనం సాగిస్తున్నామని, అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వై.వి.నరసింహరావు సమాధానమిస్తూ వెదురు బొంగులు ఉండే ప్రాంతాన్ని అభయారణ్య పరిధిలో మినహాయించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. గిద్దలూరు మండలంలో గిరిజన ఆశ్రమ పాఠశాలకు ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని సంక్షేమ అధికారికి ఛైర్మన్‌ సూచించారు. ఎస్టీ కమిషన్‌ సభ్యులు వి.శంకర్‌నాయక్‌, జంపరంగి సురేష్‌ లిల్లీ, మురళీ, జిల్లా గిరిజిన సంక్షేమాధికారి పి.జగన్నాథరావు, గిద్దలూరు ఇన్‌ఛార్జ్‌ తహసీల్దార్‌ రమాదేవి, పంచాయతీరాజ్‌ ఈఈ రమేష్‌, పట్టుపరిశ్రమశాఖ జిల్లా అధికారి ఎ.బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని