logo

దుకాణానికి చేరకుండానే నల్లబజారుకు

ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే సరకులు పక్కదారిపడుతున్నాయి. దుకాణం వరకు తీసుకురావడం ఎందుకనుకున్నారో ఏమిటో ..ఓ రేషన్‌ డీలర్‌ కుమారుడు సరకును అట్నుంచటే నల్లబజారుకు తరలించేశాడు.

Updated : 08 Feb 2023 06:20 IST

ఓ రేషన్‌ డీలర్‌ నిర్వాకం

బియ్యం తరలిస్తున్న లారీ వద్ద విజిలెన్స్‌ అధికారులు

టంగుటూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే సరకులు పక్కదారిపడుతున్నాయి. దుకాణం వరకు తీసుకురావడం ఎందుకనుకున్నారో ఏమిటో ..ఓ రేషన్‌ డీలర్‌ కుమారుడు సరకును అట్నుంచటే నల్లబజారుకు తరలించేశాడు. టంగుటూరు మండలం వాసేపల్లిపాడు చౌకదుకాణం నం.19ను లింగంగుంట సుబ్బులు పేరుతో ఆమె కుమారుడు రవిబాబు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన బియ్యం, పంచదార, కందిపప్పును సింగరాయకొండ గోదాము నుంచి అధికారులు పంపించారు. రవిబాబు ఆ సరకును దుకాణానికి చేర్చకుండా దారిలోనే నల్ల బజారుకు తరలించేశాడు. సోమవారం తహసీల్దార్‌ చిరంజీవి, ఇతర సిబ్బంది పరిశీలించగా చౌకదుకాణం మూతపడి ఉంది. గ్రామంలో విచారించగా సరకులు పంపిణీ చేయలేదని ప్రజలు తెలిపారు. దీంతో చరవాణిలో రవిబాబును ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెబుతూ సోమవారం అర్థరాత్రి వరకు కాలయాపన చేశాడు. చివరకు రాత్రి ఒంటి గంట సమయంలో తలుపులు తెరిపించి పరిశీలించగా దుకాణంలో కేవలం 375 కేజీల బియ్యం మాత్రమే ఉన్నాయి. పంచదార, కందిపప్పు  లేకపోవడంతో అక్రమంగా విక్రయించినట్లు గుర్తించారు. దుకాణదారునిపై 6ఏ కేసు నమోదుచేసి ఈ-పోస్‌ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.


310 బస్తాల బియ్యం స్వాధీనం

పీసీపల్లి, మార్కాపురం నేర విభాగం, న్యూస్‌టుడే : మార్కాపురం నుంచి కావలి ప్రాంతానికి లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పీసీపల్లి మండలం పెదఅలవలపాడు సమీపంలో మంగళవారం విజిలెన్స్‌ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. 310 బస్తాల (ఒక్కోటి 50 కేజీలు) బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కనిగిరి గోదాముకు తరలించారు. లారీని, డ్రైవర్‌ను పీసీపల్లి పోలీసులకు అప్పగించినట్లు విజిలెన్స్‌ బీవీవీ సుబ్బారావు తెలిపారు. డీసీటీవో రామారావు, ఎస్సై వెంగళరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. కాగా మార్కాపురం మండలం నాయుడుపల్లె రహదారిలో ఉన్న ఓ గోదాములో రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వలు ఉంచినట్లు అందిన సమాచారంతో ఒంగోలు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ అశోక్‌వర్ధన్‌రెడ్డి, సిబ్బంది పరిశీలించారు. గేటుకి తాళాలు వేసి ఉండటంతో రాత్రి సిబ్బందితో కాపలా ఏర్పాటుచేయించారు. పెద అలవలపాడు వద్ద బియ్యంతో పట్టుబడినవారు ఇచ్చిన సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. బుధవారం గోదాములో తనిఖీలు నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు