logo

బలిపీఠంపై బాల్యం

కొత్తపట్నం మండలం అల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన 17 సంవత్సరాల బాలికకు గతేడాది టంగుటూరుకు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. ఈ బాల్య వివాహంపై సమాచారం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది చైల్డ్‌లైన్‌తోపాటు, పోలీసులకు సమాచారం అందించారు.

Published : 08 Feb 2023 03:10 IST

18 లోపే పడుతున్న మూడుముళ్లు
జిల్లాలో 37 శాతం నమోదు

* కొత్తపట్నం మండలం అల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన 17 సంవత్సరాల బాలికకు గతేడాది టంగుటూరుకు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. ఈ బాల్య వివాహంపై సమాచారం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది చైల్డ్‌లైన్‌తోపాటు, పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి నిలిపివేయించారు. ముహూర్తం రోజున వరుడు ఇంటి వద్ద టంగుటూరు పోలీసులను రక్షణగా ఉంచారు. తర్వాతి రోజు బాలికను కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి దగ్గరి బంధువులకు ఇచ్చి వివాహం జరిపించారు. సదరు బాలిక గర్భం దాల్చడంతో అల్లూరు తీసుకొచ్చారు. గర్భవతులకు సూచనలు అందించేందుకు ఏఎన్‌ఎం సచివాలయ రిజిస్టర్‌లో వయసుతోపాటు, పేరు నమోదు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వెళ్లిన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌.. రిజిస్టర్‌ చూసి బాల్య వివాహం పట్ల సిబ్బందిని ప్రశ్నించారు.


* వెలిగండ్ల మండలం ఇమ్మడిచెరువు గ్రామానికి చెందిన 13 సంవత్సరాల బాలికకు వివాహం జరిపించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న చైల్డ్‌లైన్‌ సిబ్బంది గత నెల 23న పోలీసుల ద్వారా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తద్వారా వివాహాన్ని అడ్డుకున్నారు.


ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పాఠశాలలు, కళాశాలల్లో స్వేచ్ఛగా చదువుకోవాల్సిన బాలికల మెడలో పుస్తెల తాళ్లు పడుతున్నాయి. 18 ఏళ్లలోపు పెళ్లి చేస్తే శారీరకంగా, మానసికంగా చిక్కులు ఎదుర్కొంటారని.. తామే ఎదగాల్సిన సమయంలో కడుపులో బిడ్డను మోయడం అనేక సమస్యలకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నా అనేకమంది పెడచెవిన పెడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చైల్డ్‌లైన్‌కు అందే ఫిర్యాదులతో కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. బయటకు తెలియనివి మరెన్నో. బాల్య వివాహాల నియంత్రణపై కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పలు దఫాలు సమీక్షలు నిర్వహించారు. వాటిని అరికట్టేందుకు పదో తరగతి పూర్తయిన తర్వాత సదరు బాలికలు ఇంటర్‌, ఇతరత్రా కోర్సుల్లో ప్రవేశాలు పొందారా..లేదా అనేది విద్యాశాఖ అధికారులతో సర్వే చేయించారు. ఏదో ఒక ప్రాంతంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి.

సర్వే ఏం తేల్చిందంటే..  

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో భాగంగా నమోదైన కుటుంబాల్లోని వివరాల ప్రకారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 18 సంవత్సరాలు నిండక ముందే 37 శాతం మంది బాలికలకు వివాహాలు జరుగుతున్నాయి మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారుల గణాంకాల ప్రకారం రాష్ట్రంలోనే అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న జిల్లాల్లో అనంతపురం ప్రథమస్థానంలో ఉండగా, ప్రకాశం ద్వితీయ స్థానంలో ఉంది. 19 సంవత్సరాల లోపువారిలో 15 శాతం మంది గర్భం దాల్చుతున్నారు. తక్కువ వయసులో పెళ్లిళ్లు జరుగుతున్న నేపథ్యంలో వారిలో రక్తహీనత సమస్య అధికంగా ఉంది.


ఎవరికి సమాచారం ఇవ్వాలంటే...

ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసు అధికారులకు టోల్‌ ఫ్రీ నంబరు 100.. మహిళా, శిశు సంక్షేమశాఖ సంచాలకులు, ఐసీడీఎస్‌, చైల్డ్‌లైన్‌ 1098, మహిళా హెల్ప్‌లైన్‌ 181 నంబరుతో పాటు తహసీల్దార్‌, సీడీపీవో, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలకు సమాచారం అందించవచ్చు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.


బాల్య వివాహాల  నియంత్రణకు చర్యలు
- దినేష్‌కుమార్‌, జిల్లా బాలల సంరక్షణ అధికారి

బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం. పెళ్లి చేసినా, ప్రోత్సహించినా రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా ఉంటుంది. ఇటువంటి వివాహాలు జరిపిస్తున్న వారిని ముందే గుర్తించి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. దురాచారాన్ని రూపుమాపడంలో విద్యా వంతులు భాగస్వాములు కావాలి. తమకు పెళ్లి వద్దు..చదువు కావాలని బాలికలు ప్రశ్నించాలి. 18 ఏళ్లు నిండిన తర్వాతనే ఆడబిడ్డలకు వివాహం చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని