logo

ఒంగోలు... ఇక రెండు మండలాలు

రెవెన్యూశాఖ పరంగా పరిపాలన సౌలభ్యం నిమిత్తం జిల్లా కేంద్రమైన ఒంగోలు మండలాన్ని ఒంగోలు అర్బన్‌, గ్రామీణ మండలాలుగా విభజించారు.

Updated : 09 Feb 2023 05:50 IST

సులభతరం కానున్న రెవెన్యూ సేవలు

ఒంగోలు మండల తహసీల్దార్‌ కార్యాలయం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రెవెన్యూశాఖ పరంగా పరిపాలన సౌలభ్యం నిమిత్తం జిల్లా కేంద్రమైన ఒంగోలు మండలాన్ని ఒంగోలు అర్బన్‌, గ్రామీణ మండలాలుగా విభజించారు. గత ఏడాది అక్టోబర్‌ 20న ఆర్డీవో ద్వారా కలెక్టర్‌కు ప్రతిపాదనలు అందాయి. వాటి ఆమోదం కోరుతూ కలెక్టరేట్‌ నుంచి ప్రభుత్వానికి పంపారు. అమరావతిలో బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో దీనిని ఆమోదించారు. అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాక రెండు మండలాలకు ప్రత్యేకంగా తహసీల్దార్లతోపాటు, కార్యాలయానికి చెందిన రెవెన్యూ సిబ్బందిని అదనంగా నియమిస్తారు. రెండో కార్యాలయాన్ని ప్రస్తుత భవనం వెనుక ఉన్న సముదాయంలో నిర్వహించేలా ప్రణాళిక చేస్తున్నారు.

నగరమంతా ఒంగోలు అర్బన్‌ పరిధిలోకి

ప్రస్తుతం ఒంగోలు మండల పరిధిలో 19 రెవెన్యూ గ్రామాలు, 14 పంచాయతీలు, 46 నగరపాలక సంస్థ వార్డులతోపాటు, 83 వార్డు సచివాలయాలు ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం 2,62,529 మంది జనాభా ఉన్నారు. అందులో ఒంగోలు నగరం 2,27,097 మంది; గ్రామీణ ప్రాంతాల జనాభా 33,432. భౌగోళికంగా 49,875 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, పలు రకాల పంటలతోపాటు, కోస్తా తీర ప్రాంత గ్రామాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఒంగోలు నగరంతోపాటు, విలీన గ్రామాలైన త్రోవగుంట, ముక్తినూతలపాడు, కొప్పోలు, ఎన్‌.అగ్రహారం, పెళ్లూరు, చెరువుకొమ్ముపాలెం, వెంగముక్కపాలెంను ఒంగోలు అర్బన్‌ మండల పరిధిలోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఒంగోలు మండల పరిధిలో ఉన్న మండువవారిపాలెం, యరజర్ల, సర్వేరెడ్డిపాలెం, వలేటివారిపాలెం, కరవది, చేజర్ల, ఉలిచి, పాతపాడు, బొద్దులూరివారిపాలెం, దేవరపాడు, దేవరంపాడు దళితవాడ, గుండాయపాలెం, చింతాయగారిపాలెం, దశరాజుపల్లె గ్రామ పంచాయతీలను ఒంగోలు గ్రామీణం పరిధిలోకి తీసుకురానున్నారు.

ప్రయాసలు తప్పేనా

జిల్లా కేంద్రమైన ఒంగోలు జాతీయ రహదారిపై ఉండటంతో అమరావతి నుంచి తిరుమల వైపు రాకపోకలు సాగించే మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, న్యాయమూర్తుల తదితర విభాగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులకు ప్రోటోకాల్‌ చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంటుంది. పైగా ప్రముఖుల జయంతి, వర్ధంతి కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించాలి. దీంతో మండల తహసీల్దార్‌, ఇతర వీఆర్వోలు రోజంతా ప్రోటోకాల్‌కే పరిమితమై అర్జీదారులకు సత్వర సేవలు అందడం లేదన్న విమర్శలున్నాయి. కుల, ఆదాయ, నివాస తదితర ధ్రువీకరణ పత్రాల్లో ఏది కావాలన్నా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసినప్పటికీ అంతిమంగా తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. 300 మంది వరకు రోజుకు ఏదో ఒక పత్రం కోసం వస్తున్నారు. విద్యా సంవత్సరం ఆరంభంలో విద్యార్థులు; నవరత్నాలలో భాగంగా సంక్షేమ పథకాల మంజూరుకు లబ్ధిదారులు ధ్రువీకరణ పత్రాల కోసం అధిక సంఖ్యలో వస్తున్నారు. మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రోజూ 500 దరఖాస్తులు తహసీల్దార్‌ లాగిన్‌కు వస్తున్నాయి. అవన్నీ నిర్ణీత గడువులోపు ఇవ్వకపోవడంతో పెండింగ్‌ ఉంటున్నాయి. నగరపరిధిలో ఎక్కువగా ఆక్రమణలు ఉండటం.. కోర్టు కేసులు కూడా అధికంగా ఉన్నాయి. ఓటర్ల నమోదు, తొలగింపుల నిమిత్తం దరఖాస్తులు రావడంతో వాటిపై విచారణకు కార్యాలయ సిబ్బందిపై ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో మండలాల విభజన వల్ల సేవలు సత్వరం అందించేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని