logo

నగ్నచిత్రాలు తీసి వేధింపులు

మనస్తాపంతో పురుగుల మందు తాగి ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని గత నెలలో ఆత్మహత్య చేసుకోగా.. ఘటన వెనుక ఓ యువకుడి వేధింపులే కారణమన్న అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 09 Feb 2023 03:23 IST

వెలుగులోకి వచ్చిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య ఉదంతం
యువకుడిపై కేసు నమోదు

ముండ్లమూరు, న్యూస్‌టుడే: మనస్తాపంతో పురుగుల మందు తాగి ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని గత నెలలో ఆత్మహత్య చేసుకోగా.. ఘటన వెనుక ఓ యువకుడి వేధింపులే కారణమన్న అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. ముండ్లమూరు స్టేషన్‌ ఎస్సై ఎల్‌.సంపత్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం ముండ్లమూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని (17) విశాఖపట్నంలో బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థిని గత నెల 13వ తేదీన పురుగుల మందు తాగింది. దీంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించగా.. అక్కడి వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌ తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో 15వ తేదీన విద్యార్థిని మృతిచెందారు. ఇటీవల ఆమె చరవాణిని కుటుంబ సభ్యులు పరిశీలించగా మల్లికార్జునరెడ్డి అనే యువకుడి నంబరు ఉండటంతో అతడిని ప్రశ్నించారు. తాను అదే గ్రామానికి చెందిన సీహెచ్‌ వెంకటనారాయణరెడ్డి ఫోన్‌ చేయమంటే విద్యార్థినికి చేశానని మల్లికార్జున్‌రెడ్డి తెలిపాడు. విజయవాడలో ఇంజినీరింగ్‌ చదివే వెంకట నారాయణరెడ్డి విశాఖలో విద్యార్థిని ఉంటున్న వసతి గృహం వద్దకు వెళ్లి ఆమెను బయటకు రప్పించాడు. తమ గ్రామానికి చెందినవాడే కావడంతో విద్యార్థిని మాట్లాడారు. మాయమాటలతో సమీపంలోని లాడ్జికి తీసుకువెళ్లి నగ్న చిత్రాలు, వీడియోలు తీసి ఈ విషయం ఎవరికైనా చెబితే యూట్యూబ్‌లో పెడతానని బెదిరించాడని తెలిపారు. మానసికంగా కుంగిపోయిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. వెంకట నారాయణరెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని