logo

దూసుకొచ్చిన మృత్యువు

అమరావతి-అనంతపురం జాతీయ రహదారిలో సంతమాగులూరు మండలం పాతమాగులూరు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

Updated : 09 Feb 2023 05:53 IST

రైతు, వాహనచోదకుడు దుర్మరణం

ప్రమాదానికి గురైన వాహనం

సంతమాగులూరు, పెద్దారవీడు, న్యూస్‌టుడే: అమరావతి-అనంతపురం జాతీయ రహదారిలో సంతమాగులూరు మండలం పాతమాగులూరు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. పండించిన మిరపకాయలను గుంటూరు తీసుకువెళ్లి తిరుగు ప్రయాణమైన ఓ రైతు, మినీ వాహనం చోదకుడు ఈ ప్రమాదంలో మృతిచెందారు. ఎస్సై పి.నాగశివారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దారవీడు మండలం కంభంపాడు పంచాయతీ మల్లవరానికి చెందిన మిరప రైతు కోలగొట్ల వెంకటేశ్వరరెడ్డి (52), బోలెరో మినీ వాహనం చోదకుడు దుగ్గెంపూడి వెంకటేశ్వర్లు (35) ఎండు మిరపకాయలను గుంటూరులోని కోల్డ్‌ స్టోరేజ్‌లో భద్రపరిచేందుకు మంగళవారం రాత్రి లోడు వేసుకొని వెళ్లారు. పని పూర్తయిన వెంటనే తిరిగి మినీ వాహనంలో స్వగ్రామానికి బయలు దేరారు. బుధవారం తెల్లవారుజామున పాతమాగులూరు సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న గుంతకల్లు డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు అదుపు తప్పి వీరి వాహనాన్ని ఢీకొంది. ఇద్దరూ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్సై, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువు కె.వెంకట్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆధారం కోల్పోయిన కుటుంబాలు

రైతు వెంకటేశ్వరరెడ్డి మూడు ఎకరాల్లో మిరప సాగుచేస్తున్నారు. ఎనిమిది క్వింటాళ్ల కాయలను గుంటూరు తీసుకువెళ్లారు. ఇంటికి తిరిగి వస్తున్న ఈ క్రమంలో మృత్యువుకు చిక్కాడని తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వాహన చోదకుడు వెంకటేశ్వర్లుకు భార్య, కుమారుడు ఉన్నారు. కుటుంబాలకు ఆధారమైనవారు తరలిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఇక తమకు దిక్కెవరంటూ వారు తల్లడిల్లారు.

దుగ్గెంపూడి వెంకటేశ్వర్లు

కోలగొట్ల వెంకటేశ్వరరెడ్డి (పాతచిత్రాలు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని