logo

ఫలించిన నిరీక్షణ

జిల్లాకు చెందిన 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు త్వరలో నియామకాలు జరగనున్నాయి. ఈ మేరకు మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది.

Published : 09 Feb 2023 03:23 IST

98 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టులు

జిల్లాలో 710 మందికి అవకాశం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లాకు చెందిన 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు త్వరలో నియామకాలు జరగనున్నాయి. ఈ మేరకు మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. 98 డీఎస్సీ సమయంలో 1:3 పద్ధతిన అభ్యర్థులను మౌఖిక పరీక్షలకు పిలిచారు. పరీక్షలో అర్హత సాధించి ఇంటర్వ్యూ వరకు వెళ్లి పోస్టు రాక నిరాశ చెందినవారు వందల సంఖ్యలో ఉన్నారు. అంతకు ముందు జరిగిన డీఎస్సీల్లో మిగిలిపోయిన వారికి రోస్టర్‌, సీనియారిటీ ప్రకారం ఖాళీ అయిన పోస్టులు కేటాయించినందున అదేవిధంగా భవిష్యత్తులో వచ్చే ఖాళీలను తమతో భర్తీచేయాలని క్వాలిఫైడ్‌ అభ్యర్థులు కోరారు. ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడంతో నాడు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎట్టకేలకు గత ఏడాది ప్రభుత్వం పోస్టులు ఇస్తామని ప్రకటించింది. ఆమేరకు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులకు మార్గం సుగమమైంది. జిల్లాకు సంబంధించి ఇక్కడి అభ్యర్థుల అర్హత పత్రాలను పరిశీలించి జాబితా సిద్ధం చేయించారు. గత ఏడాది ఆగస్టులో ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం పాఠశాలలో నిర్వహించిన ఈ పరిశీలన కార్యక్రమానికి మొత్తం 710 మంది హాజరయ్యారు. వాస్తవానికి వేయి మందికి పైగానే ఉన్నప్పటికీ కొంతమంది అప్పటికే ఇతర ఉద్యోగాల్లో చేరిపోయారు. మరికొందరు ఆసక్తి లేక రాలేదు. మినిమం టైస్కేల్‌ కింద నెలకు రూ.34 వేల వేతనం చెల్లిస్తారు. అభ్యర్థులంతా 47-55 సంవత్సరాల మధ్య వయసుగలవారు. ఉద్యోగ విరమణ సమయం వరకు వారు పనిచేసే అవకాశం ఉంది.

మార్గదర్శకాలకు అనుగుణంగా కౌన్సెలింగ్‌

98 డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వ ప్రకటన గురించి డీఈవో బి.విజయభాస్కర్‌ను సమాచారం కోరగా మినిమం టైస్కేల్‌ పద్ధతిలో నియామకాలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారని, కమిషనర్‌ కార్యాలయం నుంచి మార్గదర్శకాలు రాగానే ఖాళీ పోస్టుల ప్రకటన, సీనియారిటీ జాబితా, కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని