logo

అంత్యక్రియల అడ్డగింత

రెండు రోజులుగా మృతదేహాన్ని పూడ్చనివ్వకుండా కొందరు అడ్డుకున్న సంఘటన కనిగిరి మండలంలోని భూతంవారిపల్లిలో బుధవారం వెలుగుచూసింది.

Updated : 09 Feb 2023 05:54 IST

రెండు రోజులుగా  ఇంటిలోనే మృతదేహం

ఇరు వర్గాలతో మాట్లాడుతున్న సీఐ బి.పాపారావు

కనిగిరి, న్యూస్‌టుడే: రెండు రోజులుగా మృతదేహాన్ని పూడ్చనివ్వకుండా కొందరు అడ్డుకున్న సంఘటన కనిగిరి మండలంలోని భూతంవారిపల్లిలో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకెళితే గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మన్నం అంకయ్య(64) సుమారు నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఒంగోలులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి గత సోమవారం రాత్రి మృతి చెందారు. దీంతో కుటుంబసభ్యులు మంగళవారం గ్రామ శివారులో శ్మశాన వాటికగా అందరూ వినియోగించే స్థలంలోనే పూడ్చేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన నాగార్జునరెడ్డి ఆయన బంధువులు అక్కడకు చేరుకొని ఇది తమ పొలమని, పూడ్చేందుకు కుదరదని అడ్డుకున్నారు. దీంతో మృతుని కుటుంబసభ్యులు గ్రామ పెద్దలకు విషయం తెలియజేశారు. వారు చెప్పినప్పటికీ అంగీకరించకపోవడంతో బుధవారం మృతదేహాన్ని పూడ్చేందుకు వచ్చారు. దీంతో సంఘటన స్థలంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సీఐ బి.పాపారావు, తహసీల్దార్‌ వి.పుల్లారావు అక్కడకు చేరుకుని ఇరు వర్గాల వారితో మాట్లాడారు. మృతదేహాన్ని వేరోచోట పూడ్పించి వివాదాన్ని సర్దుమణిగించారు. ఈ విషయమై తహసీల్దార్‌ పుల్లారావు మాట్లాడుతూ నాగార్జునరెడ్డి, మరికొందరికి సదరు శ్మశాన స్థలంలో హక్కులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం పాసు పుస్తకాలు కూడా ఇచ్చిందని తెలిపారు. అయితే వాటి హద్దులు ఎక్కడ వరకు ఉన్నాయో కొలతలు వేయించి వివాదం లేకుండా చూస్తామన్నారు. అవసరమైతే ఎస్సీ కాలనీ వాసులకు వేరే చోట శ్మశాన వాటిక ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని