logo

చుక్కల భూములకు తొలగిన చిక్కులు

ఒంగోలు మండలం మామిడిపాలెం గ్రామంలోని ఓ రైతుకు చెందిన రెండెకరాల విస్తీర్ణాన్ని వెబ్‌ల్యాండ్‌లో చుక్కల భూమిగా చూపడంతో నిషేధిత జాబితాలో చేర్చారు. 2020లో ఆయన కూతురుకు వివాహం కుదిరింది.

Published : 20 Mar 2023 01:22 IST

జిల్లాలో 17,522 మంది రైతులకు ఉపశమనం
కొత్తపట్నం, న్యూస్‌టుడే:

ఒంగోలు మండలం మామిడిపాలెం గ్రామంలోని ఓ రైతుకు చెందిన రెండెకరాల విస్తీర్ణాన్ని వెబ్‌ల్యాండ్‌లో చుక్కల భూమిగా చూపడంతో నిషేధిత జాబితాలో చేర్చారు. 2020లో ఆయన కూతురుకు వివాహం కుదిరింది. ఆ సమయంలో పెళ్లి ఖర్చుల కింద విక్రయించేందుకు సిద్ధమయ్యారు. చుక్కుల భూమిగా నమోదు కావడంతో రిజిస్ట్రేషన్‌ నిలిచి పోయింది. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. దీంతో బాధిత రైతు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది.

భూమి వారిదే. అందుకు సంబంధించిన పత్రాలూ ఉన్నాయి. అయినా హక్కులు సంపాదించుకునేందుకు తహసీల్దార్‌ కార్యాలయాల దగ్గర నుంచి కలెక్టరేట్‌ వరకు కాళ్లరిగేలా తిరిగారు. కారణం నిషేధిత భూముల జాబితాలో నమోదు కావడమే. పిల్లల ఉన్నత చదవుల నిమిత్తమో, అమ్మాయిల వివాహ ఖర్చుల కోసమో, వైద్యచికిత్సల వ్యయానికో ఎవరికైనా అమ్ముదామన్నా... ఇల్లు కట్టుకునేందుకు లేదా పంట రుణం తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లినా నిరాశ ఎదురయ్యేది. ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం ఏదోఒక సాకుతో కాలయాపన చేయడమో తిరస్కరించడమో చేశారు. వెబ్‌ల్యాండ్‌లో చుక్కల భూములుగా చూపుతుండటంతో రైతులు వాటిని అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్లు అవ్వక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఈ వెతలు తీరనున్నాయి.

2008 నుంచి రిజిస్ట్రేషన్ల నిలిపివేత...: బ్రిటిష్‌ పాలకుల ఆధ్వర్యంలో 1902 నుంచి 1906వ సంవత్సరం వరకు రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌(ఆర్‌ఎస్‌ఆర్‌) రూపొందించారు. ఆ సమయంలో సాగులో లేని, యజమానులు అందుబాటులో లేని భూములను ఆర్‌ఎస్‌ఆర్‌లో నమోదు చేసేటప్పుడు సంబంధిత హక్కుదారుల పేర్లకు బదులు చుక్కలు(డాట్స్‌) పెట్టారు. వీటిని క్రమంగా కొంతమంది తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మరికొన్ని భూములకు ప్రభుత్వం డీకే పట్టాలిచ్చింది. కాలక్రమేణా వాటికి రిజిస్ట్రేషన్లు చేయడం, రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయడం, రిజిస్ట్రేషన్లు కూడా కావడంతో అవి సాధారణ భూములుగానే మారిపోయాయి. అమ్మడానికి వీల్లేని డీకే పట్టా, గిరిజన, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, అసైన్డ్‌ భూముల వివరాలను 1908 భూ చట్టం ప్రకారం 2007లో 22ఏ జాబితాలో చేర్చారు. 2008 తర్వాత భూముల ఆన్‌లైన్‌ విధానం రావడంతో ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలున్న భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. నిషేధిత భూముల జాబితాలను తహసీల్దార్లు సంబంధిత రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు పంపారు. అప్పటివరకు క్రయవిక్రయాలు సాగినప్పటికీ.. ఆ తర్వాత నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో 2017 జూన్‌ 13కు ముందు 12 ఏళ్లు అనుభవంలో ఉన్న రైతులకు ఆ భూమిపై శాశ్వత హక్కు కల్పించి వారి పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొందరు రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు.

కలెక్టరేట్‌లో కసరత్తు మొదలు...

ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్లు కాకుండా... జిల్లా వ్యాప్తంగా చుక్కల భూములతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఎట్టకేలకు ఉపశమనం కలగనుంది. తాజాగా జిల్లాలోని చుక్కల భూముల రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు అధికారాలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా జిల్లాలోని 17,522 మంది రైతులకు సుమారు 37 వేల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి చిక్కులు తొలగనున్నాయి. సదరు భూములపై రెవెన్యూ కార్యాలయాలతో పాటు, జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనూ గెజిట్‌ ఇవ్వనున్న నేపథ్యంలో వెబ్‌ల్యాండ్‌లో పట్టా భూములుగా మారుస్తూ సంబంధిత రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించనున్నారు. ఈ ప్రక్రియ వెంటనే అమలులోకి వచ్చేలా కలెక్టరేట్‌లోని రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని