logo

అరెస్టులు.. అణచివేతలు

ఉద్యమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తమకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయాలన్న అంగన్‌వాడీ కార్యకర్తలను, జీఓ నెం 1 రద్దు కోసం చలో విజయవాడ పిలుపునిచ్చిన విపక్షాల నాయకులను ఎక్కడికక్కడ నిర్భంధించారు.

Updated : 21 Mar 2023 07:19 IST

పోలీసుల అదుపులో అంగన్‌వాడీలు, విపక్ష నాయకులు

నోటీసులిస్తామంటూ స్టేషన్లలో బందీ

త్రిపురాంతకం: మేడపి టోల్‌ప్లాజా వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలను అడ్డుకుని మాట్లాడుతున్న పోలీసులు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఉద్యమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తమకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయాలన్న అంగన్‌వాడీ కార్యకర్తలను, జీఓ నెం 1 రద్దు కోసం చలో విజయవాడ పిలుపునిచ్చిన విపక్షాల నాయకులను ఎక్కడికక్కడ నిర్భంధించారు. ప్రధానంగా సీఐటీయూ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగు యువత నాయకులపై దృష్టి సారించారు. నోటీసులిచ్చి పంపుతామంటూ స్టేషన్లకు రమ్మని పిలిచి ఆదివారం రాత్రంతా అక్కడే ఉంచారు. జిల్లావ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించినవారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. జిల్లాలోని పలు ప్రధాన రహదారుల్లో వాహనాలను పరిశీలించారు. విజయవాడ వెళ్తున్నామని సమాధానం చెబితే చాలు.. వాహనాలతో సహా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలులోని ఒకటో పట్టణ, రెండో పట్టణ, తాలూకా పోలీసు స్టేషన్లలో సుమారు 15మంది టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగు యువత కార్యకర్తలను రాత్రంతా నిర్బంధించారు. వీరిలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ముత్తన శ్రీనివాస్‌, 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ తిప్పరామల్లి రవితేజతో పాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు. తాము విజయవాడ వెళ్లడంలేదని చెప్పినా పోలీసులు వినిపించుకోకుండా వారిని సోమవారం ఉదయం కూడా బయటకు పంపలేదు. ఉన్నతస్థాయి నుంచి ఉత్తర్వులు అందిన తర్వాతనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

ఎక్కడికక్కడ అవరోధాలు..

దర్శి నుంచి సుమారు 20 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు మూడు వాహనాల్లో విజయవాడ వెళ్తుండగా కురిచేడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించారు. త్రిపురాంతకం సమీపంలోని మేడపి టోల్‌ప్లాజా వద్ద 25 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతపురం, కడప జిల్లాల నుంచి విజయవాడ వెళ్తున్న పలువురు వాహనదారులను పామూరు పోలీసులు నిలువరించారు. వారిని తమ నిర్భంధంలోకి తీసుకున్నారు. కనిగిరి నుంచి వెళ్తున్నవారిని జాతీయ రహదారిపై మద్దిపాడు మండలం గ్రోత్‌సెంటర్‌ వద్ద నాగులుప్పలపాడు ఎస్సై అడ్డుకున్నారు. పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత సాయంత్రం నాలుగుగంటల సమయంలో వారిని విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని