logo

పశ్చిమంలో మట్టి మాఫియా

అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ భూములు, కుంటలు, దేవస్థానం స్థలాల్లో మట్టి తవ్వకాలు చేసి ఆర్జిస్తున్నారు.

Updated : 21 Mar 2023 07:16 IST

కరిగిపోతున్న కొండలు, మాయమవుతున్న కుంటలు

కోలభీమునిపాడు సమీప ముద్దసానమ్మగండి వద్ద తవ్వకాలతో కొండ ఇలా..

మార్కాపురం, న్యూస్‌టుడే:

అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ భూములు, కుంటలు, దేవస్థానం స్థలాల్లో మట్టి తవ్వకాలు చేసి ఆర్జిస్తున్నారు. ఈ ఉదంతాలపై ఫిర్యాదులు చేస్తే అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మార్కాపురం మండలంలోని వేములకోట- నికరంపల్లె ఆయకట్టు చెరువు, గోగులదిన్నె శివారులోని ప్రభుత్వ భూములు, తర్లుపాడు మండలం సీతానాగులవరం కొండ ప్రాంతం.. పోతలపాడు, గానుగపెంట గ్రామాల సమీపంలో అక్రమ మట్టి వ్యాపారం జోరుగా సాగుతోంది. రాయవరం, నాయుడుపల్లె చెరువులు, దరిమడుగు- ఇడుపూరు ఇలాకాలోని మహమ్మద్‌ సాహెబ్‌ కుంట, కోలభీమునిపాడు దరి ముద్దసానమ్మగండి వద్ద ఉన్న కొండ, కలనూతల పునరావాస గ్రామ సమీపంలోని కొండ చూస్తుండగానే ధ్వంసమవుతున్నాయి. రాత్రి 10 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 వరకు టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. రోజూ రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నారు. దీంతో కొండలు కరిగిపోతుండగా చెరువులు రూపు కోల్పోతున్నాయి. ఎక్కడికక్కడ ప్రమాదకరంగా గుంతలు కనిపిస్తున్నాయి.

టిప్పర్‌కు రూ.5 వేలు..

మార్కాపురం పట్టణంతో పాటు మండలంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తి వెంచర్లు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు ఇళ్ల నిర్మాణాలు చేసేవారి కోసం అక్రమార్కులు ఒప్పందాలు కుదుర్చుకొని మట్టి అందిస్తున్నారు. చెరువు మట్టి అయితే టిప్పర్‌కు రూ.3 వేలు, కొండ మట్టికి రూ.5వేలు వసూలు చేస్తున్నారు. అదే చెరువు మట్టి ట్రాక్టరు లోడుకు రూ.1500 తీసుకుంటున్నారు. మార్కాపురం భూగర్భగనులశాఖ కార్యాలయంలో ఏడీ, ఒక్క ఆర్‌ఐ మాత్రమే ఉన్నారు. దాడులు చేయడానికి తగిన సిబ్బంది లేరు. పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం కోరినప్పుడు వారు సకాలంలో స్పందించకపోవడంలో అక్రమార్కులు సులువుగా తప్పించుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూగర్భ గనులశాల ఏడీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఎక్కడ నుంచి ఫిర్యాదులు వచ్చినా దాడులు చేస్తున్నామన్నారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు రూ.1.50 కోట్ల అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు. మట్టి సరఫరాకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని