logo

అప్పుల బాధ తాళలేక..

 అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు యత్నించిన రైతన్న చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మార్కాపురం మండలంలోని గజ్జలకొండ పంచాయతీ మాలపాటిపల్లెలో చోటు చేసుకుంది.

Updated : 21 Mar 2023 07:17 IST

ఆత్మహత్యకు  యత్నించిన రైతు మృతి

కోటిరెడ్డి (పాత చిత్రం)

మార్కాపురం, న్యూస్‌టుడే:  అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు యత్నించిన రైతన్న చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మార్కాపురం మండలంలోని గజ్జలకొండ పంచాయతీ మాలపాటిపల్లెలో చోటు చేసుకుంది. బంధువులు, మార్కాపురం గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మాలపాటిపల్లెకి చెందిన గొలమారి కోటిరెడ్డి (51) తనకున్న నాలుగు ఎకరాలతో పాటు స్థానికుల నుంచి మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప పంటలు సాగు చేశారు. సాగు నీరందించేందుకు పొలాల్లో అయిదు బోర్లు తవ్వించగా, నాలుగింటిలో నీరు పడలేదు. పొలం, కుటుంబ అవసరాల కోసం సుమారు రూ.13 లక్షల వరకు అప్పులు చేశారు. దిగుబడులు నామమాత్రంగా రావడంతో అప్పులు తీర్చే దారి లేక తీవ్ర మనస్తాపానికి గురైన రైతు కోటిరెడ్డి ఈ నెల 9న పురుగు మందు తాగి పొలంలో పడిపోయారు. గుర్తించిన సహచర రైతులు, కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మార్కాపురంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలులోని కిమ్స్‌ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు చెప్పారు. ఒంగోలులో శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రైతు కుటుంబాన్ని జడ్పీటీసీ సభ్యుడు నారు బాపనరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మాలపాటి శ్రీనివాసరెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు పరామర్శించి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు గ్రామీణ ఎస్సై ఆర్‌.సుమన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని