logo

రెండు లక్షల మంది విద్యార్థులకు రాగి జావ

జగనన్న గోరుముద్ద పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నుంచి రాగి జావ అమల్లోకి తీసుకురానున్నారు.

Published : 21 Mar 2023 06:19 IST

నేటి నుంచి ప్రభుత్వ బడుల్లో ప్రారంభం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జగనన్న గోరుముద్ద పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నుంచి రాగి జావ అమల్లోకి తీసుకురానున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు అవసరమయ్యే సరకులను శ్రీసత్యసాయి బాబా సెంట్రల్‌ ట్రస్టు తరపున ఇప్పటికే పాఠశాలలకు సరఫరా చేశారు. జిల్లాస్థాయిలో కార్యక్రమాన్ని ప్రకాశం భవన్‌లోని వీక్షణ సమావేశం మందిరంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,418 మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 2022-23 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 2,00,891 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుండగా; అందుకు అవసరమయ్యే బియ్యాన్ని ప్రతి నెలా పౌరసరఫరాల సంస్థ ద్వారా చౌకధరల దుకాణాలకు తరలిస్తున్నారు. విద్యార్థులకు వారానికి అయిదు రోజులపాటు (శనివారం మినహాయించి) కోడిగుడ్లు.. సోమ, బుధ, శుక్రవారం ఒక్కో చిక్కీ చొప్పున అందజేస్తున్నారు. జిల్లాలో 1,90,846 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు.

పాఠశాలలకు చేరిన రాగి పిండి, బెల్లం

విద్యార్థులకు చిక్కీలు పంపిణీ చేయని మంగళ, గురు, శనివారాలు రాగిజావ ఇచ్చేలా ప్రణాళిక చేశారు. రాగి పిండి, బెల్లం పొడి ఇటీవల రేషన్‌ దుకాణాలకు తరలించగా అక్కడినుంచి సోమవారం అన్ని పాఠశాలలకు చేర్చారు. ప్రస్తుతం ఒక నెలకు సరిపడా 22.080 మెట్రిక్‌ టన్నుల చొప్పున వీటి నిల్వలు ఉన్నాయి. పథకం అమలు పర్యవేక్షణ బాధ్యతలను ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. రాగి జావ పంపిణీ ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడంతోపాటు, పథకం విజయవంతంగా అమలు చేసేలా జిల్లాలోని హెచ్‌ఎంలకు ఆదేశాలిచ్చినట్లు డీఈవో పి.రమేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని