logo

పసుపు దళం.. విజయోత్సాహం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో జిల్లాలో పార్టీ శ్రేణులు వేడుకలు నిర్వహించాయి.

Updated : 24 Mar 2023 05:36 IST

ఎమ్మెల్సీగా అనురాధ గెలుపుతో  సంబరాలు

కనిగిరి: టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్న తెదేపా శ్రేణులు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో జిల్లాలో పార్టీ శ్రేణులు వేడుకలు నిర్వహించాయి. ఒంగోలు, కనిగిరి, కొండపి, మార్కాపురం తదితర ప్రాంతాల్లో కేకులు కోసి, బాణసంచా కాల్చారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ నిర్దేశంలో నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. గుంటూరు రోడ్డులోని కార్యాలయం నుంచి అద్దంకి బస్టాండ్‌, కలెక్టరేట్‌, కోర్టు సెంటర్‌, ముంగమూరురోడ్డు, కర్నూలురోడ్డు మీదగా ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. ఒంగోలు బీకే అపార్టుమెంట్‌లో జనార్దన్‌ కేకు కోశారు. దర్శిలోని గడియార స్తంభం కూడలి వద్ద జరిగిన కార్యక్రమంలో తెదేపా ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగరపంచాయతీ ఛైర్మన్‌ పిచ్చయ్య పాల్గొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెదేపాదే విజయమని బాలాజీ అన్నారు.

కనిగిరిలో పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వైఖరిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని నేతలు అన్నారు. నియంతృత్వ పోకడలను భరించలేక, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేవారు తెదేపాకు మద్దతుగా నిలిచినట్లు అభిప్రాయపడ్డారు. అయితే తెదేపాకు 19 మంది సభ్యులే ఉన్నప్పటికీ 23 ఓట్లు రావడంతో మిగిలిన నాలుగు ఓట్లు ఎవరేశారన్న చర్చ జిల్లాలో సాగింది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వచ్చినా వారిలో ఒకరు తాను వ్యతిరేక ఓటు వేయలేదని వివరణ ఇచ్చుకున్నారు.

ఒంగోలులోని తెదేపా కార్యాలయం వద్ద వేడుకల్లో నేతలు, కార్యకర్తలు


సొంత వాళ్లనూ పట్టించుకోని సీఎం

దామచర్ల జనార్దన్‌, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్‌ ఇంటికే పరిమితమయ్యారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సైతం అభివృద్ధిని పట్టించుకోలేదు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో రాష్ట్రంలో ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారో స్పష్టమైంది. అన్నిటికంటే ముఖ్యంగా 23వ తేదీన, 23 ఓట్లతో తెదేపా అభ్యర్థి గెలవడం, అది కూడా పార్టీ నుంచి లాక్కున్న నాలుగు ఓట్లు వైకాపా నుంచి పడటం ఇక్కడ ప్రస్తావించదగ్గ అంశం.


ధర్మం గెలిచింది

బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే, కొండపి

గత ఎన్నికల్లో తెదేపాకు 23 స్థానాలు వచ్చాయి. అయితే నలుగురు వైకాపా గూటిలో చేరారు. గెలుస్తామన్న ధీమాతోనే అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రస్తుతం అభ్యర్థిని నిలబెట్టారు. సీఎం జగన్‌ పాలన, ఆయన అనుసరిస్తున్న విధానాలు, అభివృద్ధి లేకపోవడం, ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వకపోవడం వంటి పరిణామాలన్నీ వైకాపా ఎమ్మెల్యేల్లో కొంతమందిని ఆలోచింపజేశాయి. సీఎం తీరుతో విసుగుచెందినవారు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేవారు తెదేపా అభ్యర్థికి ఓటేశారు. ధర్మం గెలిచింది. భవిష్యత్తు విజయానికి ఇది నాంది.


నియంతృత్వ ధోరణిని సహించలేకనే..

ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కనిగిరి

జగన్‌మోహన్‌రెడ్డి నియంతృత్వ ధోరణితో వెళ్లడాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలే సహించలేదనడానికి ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి గెలవడమే నిదర్శనం. ప్రజాస్వామ్యబద్దంగా గెలుపొందిన ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. అసంతృప్తికి గురైన వారు ఇలా ఓటు వేశారు. చంద్రబాబు పాలనతోనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని ప్రజలతోపాటు, వైకాపా ప్రజాప్రతినిధులు నమ్మారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని