logo

చేయూతకు ఇదేం వాత?

స్వయం సహాయక సంఘాల సభ్యులకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు దోహదపడాల్సిన మహిళా మార్టు అది.. చేయూత సంగతి అటుంచితే ఒత్తిడి చేసి మహిళలతో కొనుగోళ్లు చేయించడం, సంబంధిత బిల్లులపై గ్రూపు పేరు నమోదు చేయించడం, ప్రతీ ఒక్కరు రూ.500 విలువైన సరకులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేయడం చూసి వారంతా ఆవేదన చెందుతున్నారు.

Updated : 24 Mar 2023 05:38 IST

స్వయం సహాయక సంఘాలపై ఒత్తిడి తెచ్చి సరకుల విక్రయం
టంగుటూరు మహిళా మార్టులో పరిస్థితి

ఇటీవల ఏర్పాటు చేసిన మార్టు

స్వయం సహాయక సంఘాల సభ్యులకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు దోహదపడాల్సిన మహిళా మార్టు అది.. చేయూత సంగతి అటుంచితే ఒత్తిడి చేసి మహిళలతో కొనుగోళ్లు చేయించడం, సంబంధిత బిల్లులపై గ్రూపు పేరు నమోదు చేయించడం, ప్రతీ ఒక్కరు రూ.500 విలువైన సరకులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేయడం చూసి వారంతా ఆవేదన చెందుతున్నారు. గత డిసెంబరులో జిల్లాలోనే మొట్టమొదటిసారిగా టంగుటూరులో ఏర్పాటుచేసిన ‘చేయూత మహిళా మార్టు’లో నెలకొన్న పరిస్థితి ఇది.

టంగుటూరు, న్యూస్‌టుడే: కార్పొరేట్‌ కంపెనీలకు దీటుగా తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యావసర సరకులను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో టంగుటూరులో ఈ మార్టును ఏర్పాటుచేశారు. ఈ మండలంలోని 1,840 పొదుపు సంఘాల్లో సుమారు 20 వేల మంది మహిళలు ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి షేర్‌ క్యాపిటల్‌ కింద రూ.200 వరకు సేకరించి రూ.35 లక్షల నిధులు మార్టుకు సమకూర్చాలని నిర్దేశించుకున్నా రూ.22 లక్షలే వచ్చాయి. ఇక్కడ పని చేసేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చి గౌరవ వేతనం అందిస్తున్నారు. మార్టు ప్రారంభ దశలో ఆదాయం బాగానే ఉన్నా ఆ తర్వాత క్రమేణా తగ్గింది. బయటి ధరలతో పోల్చితే కొంచెం ఎక్కువగా ఉండటం కూడా ఓ కారణమన్నది మహిళల అభిప్రాయం.

ప్రతీ ఒక్కరు రూ.500కు కొనుగోలు చేయాల్సిందే..

నిత్యం ఈ మార్టు ద్వారా రూ.లక్ష విలువైన సరకులు అమ్మాల్సి ఉంది. ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్యలో లావాదేవీలు ఉంటున్నాయి. దీంతో అధికారులు ఓ ప్రణాళికను రచించారు. మండలంలోని 18 వేలమంది సభ్యులతో ఒక నెలలో ఒక్కొక్కరిచేత రూ.500 చొప్పున వస్తువులు కొనుగోలు చేయిస్తే రూ.90 లక్షల వరకు విక్రయాలు జరుగుతాయని నిర్ణయించారు. మార్టు నుంచి ప్రతీ మహిళ రూ.500కు తక్కువ లేకుండా వస్తువులు కొనుగోలు చేయాల్సిందేనని షరతు విధించినట్లు సమాచారం. కొనుగోలు చేయనివారికి రుణమాఫీ వర్తించదని, అలానే రుణాలు ఇచ్చేది లేదంటూ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో గత రెండు మూడు రోజులుగా చేయూత మార్టుకు సంఘాల మహిళలు క్యూ కడుతున్నారు. ఇక్కడ కొనుగోలు చేసినవారు బిల్లుపై ఆయా గ్రూపు పేరు రాయించుకు వెళ్లి ఆ గ్రామ వీవోఏలకు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. బయట దుకాణాలకంటే మార్టులో తక్కువ ధరలకే వస్తువులు అందిస్తే తామే కొనుగోలు చేస్తామని.. ఇలా ఒత్తిడి పెంచాల్సిన అవసరమేముందని పలువురు మహిళలు ప్రశ్నిస్తున్నారు. కాగా మార్టు నిర్వహణకు 12 మందితో ఒక కమిటీ ఏర్పాటుచేశారు. ఏ వస్తువులు ఇక్కడ ఉంచాలనేది వారు నిర్ణయిస్తారు. ఎవరిష్టమొచ్చినట్లు వారు యాప్‌ల ద్వారా ఆర్డర్లు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  


సభ్యులకు అలవాటు కావాలనే..

మార్టులో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులు

మార్టులో బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారనే అంశంపై చేయూత డీపీఎం సునీత వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించింది. సభ్యులను మార్టుకి అలవాటు చేయాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్పామని, ఒత్తిడి చేసి కొనుగోలు చేయించమని తెలపలేదన్నారు. ఎవరైనా స్వచ్ఛందంగా కొనుగోలు చేసుకోవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని