logo

మళ్లీ కొవిడ్‌

కొవిడ్‌పై వైద్యఆరోగ్యశాఖ మరోసారి అప్రమత్తమైంది.. అన్ని రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని, అనుమానిత కేసులను పరీక్షించి, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఆదేశాలిచ్చారు.

Updated : 24 Mar 2023 05:40 IST

పరీక్షలు పెంచేందుకు అధికారుల ఆదేశాలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: కొవిడ్‌పై వైద్యఆరోగ్యశాఖ మరోసారి అప్రమత్తమైంది.. అన్ని రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని, అనుమానిత కేసులను పరీక్షించి, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఆదేశాలిచ్చారు. దీంతో వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లా వ్యాప్తంగా ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు జ్వర సర్వే చేపట్టాలని డీఎంహెచ్‌వో ఎస్‌.రాజ్యలక్ష్మి ఆదేశించారు. కురిచేడులో ఓ వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో ఆ ఇంటిలోని ఇతర సభ్యులకు కూడా పరీక్షలు చేశారు. మిగిలిన వారికి నిర్ధారణ కాలేదు. వివిధ రాష్ట్రాల్లో హెచ్‌-3 ఎన్‌-2 వైరస్‌ కేసులు ఉండటంతో అతని నమూనాలూ ప్రయోగశాలకు పంపించారు. ఇకపై వచ్చే అన్ని పాజిటివ్‌ కేసులను వైరాలజీ ల్యాబ్‌కు పంపనున్నారు.

ఐదు వేల కిట్లు అవసరం

గత నెలలో ఇన్‌ఫ్లూయెంజా వల్ల ప్రతి ఇంటా జలుబు, గొంతునొప్పి, జ్వరాలు వచ్చి వారం నుంచి 15 రోజుల పాటు ఇబ్బందిపడ్డారు. తరువాత తగ్గిపోతుండటంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ పరీక్షలు పెంచాలని ఆదేశాలిచ్చింది. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ సురేష్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా జీజీహెచ్‌లోని వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లో రోజువారీ కొన్ని పరీక్షలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో ఇంకా కొత్త వైరస్‌ కేసులు నమోదు కాలేదన్నారు. 17 కేంద్రాల్లో ట్రూనాట్‌ ల్యాబ్‌లు ఉన్నాయన్నారు. అవసరాన్ని బట్టి పరీక్షలు ప్రారంభిస్తామన్నారు. జిల్లాకు 5 వేల కిట్లు కావాలని కోరామన్నారు. ముక్కు లేదా గొంతు నుంచి నమూనా సేకరించి అక్కడికక్కడే పరీక్ష చేయవచ్చన్నారు.

కురిచేడులో నమోదు

కురిచేడు, న్యూస్‌టుడే: కురిచేడులో ఓ వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్టు గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కురిచేడు ఎన్నెస్పీ కాలనీకి చెందిన వ్యక్తి (48) ఈ నెల 20న జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో గుంటూరు సమీపంలోని ఓ వైద్యశాలకు వెళ్లారు. అక్కడ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. గురువారం విషయం తెలుసుకుని ఆ వ్యక్తి నుంచి నమూనాలు సేకరించి గుంటూరు వైరాలజీ ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. ప్రజలు చేతుల శుభ్రత, భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని