logo

మేలుకోకుంటే విస్తరిస్తుంది..!

సకాలంలో గుర్తిస్తే నివారణ ఎంత సులభమో.. నిర్లక్ష్యం చేస్తే అంతే చేటు తెచ్చే వ్యాధి ‘క్షయ’. దీనిని పూర్తిగా రూపుమాపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విభాగాలను నిర్వహిస్తూ రూ.కోట్లు వ్యయం చేస్తున్నాయి.

Updated : 24 Mar 2023 05:39 IST

జిల్లాలో ఇప్పటికే 1729 క్షయ కేసులు

జీజీహెచ్‌లో మొండి క్షయ నిర్ధారణకు వినియోగించే సీబీనాట్‌ పరీక్ష యంత్రం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: సకాలంలో గుర్తిస్తే నివారణ ఎంత సులభమో.. నిర్లక్ష్యం చేస్తే అంతే చేటు తెచ్చే వ్యాధి ‘క్షయ’. దీనిని పూర్తిగా రూపుమాపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విభాగాలను నిర్వహిస్తూ రూ.కోట్లు వ్యయం చేస్తున్నాయి. 2025 కల్లా నివారణే లక్ష్యం పెట్టుకున్నాయి. అయినా ఆశించినరీతిలో ఫలితాలు కనిపించడంలేదు. ప్రజల్లో అవగాహన లోపం, లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రాకపోవడం మూలంగా కేసుల సంఖ్య తగ్గడం లేదు. జిల్లాలో ప్రస్తుతం యంత్రాంగం గుర్తించిన గణాంకాల ప్రకారం 1729 మంది క్షయతో బాధపడుతున్నారు. శుక్రవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం.. ఈ సందర్భంగా ఇక్కడి పరిస్థితిని పరిశీలిస్తే..
జిల్లాలో ప్రస్తుతం వ్యాధితో బాధపడుతున్నవారికి వైద్యశాఖ సిబ్బంది ద్వారా వారి ఇళ్లకు వెళ్లి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. పౌష్టికాహారం కోసం ప్రభుత్వం నెలకు రూ.500 ఇస్తుండగా, తాజాగా దాతల సాయంతో రూ.700 విలువైన పోషకాహార కిట్‌ ఇస్తున్నారు. ఇప్పటివరకు 645 మందికి కందిపప్పు, మినపపప్పు, నూనె, వేరుశనగ, శనగ, నువ్వుల ఉండలు అందిస్తున్నారు. గ్లాండ్‌ ఫార్మా సంస్థ 500 మందిని, భారత్‌ బయోటెక్‌ 25 మంది, జిల్లా అధికారుల సంఘం 30. ఇతరులు 50 మందికి ఈ కిట్‌లు అందజేస్తున్నారు. 17 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోల క్షయ పరీక్షలు, రెండు సీబీనాట్‌ కేంద్రాలలో మొండి క్షయ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. సాధారణ క్షయకు క్రమం తప్పకుండా మందులు వాడితే ఆరునెలల్లో తగ్గిపోతుంది. మొండి క్షయకు మాత్రం 9 నుంచి 20 నెలల వరకు వాడాలి. ఎక్కడ కేసు నమోదైనా ప్రభుత్వ ఆసుపత్రికి తెలియజేస్తే ఉచితంగా మందులు ఇస్తారు. అదే విధంగా ప్రైవేటు ఆసుపత్రులవారు గుర్తించి అధికారులకు తెలియజేస్తే ఒక్కో కేసుకు రూ.500 పారితోషికం అందిస్తారు.

నాడు పెరిగిన మరణాలు..:  క్షయ ఉన్నవారికి కొవిడ్‌ సోకడం సులభం. మరణాలూ ఎక్కువే. సాధారణ రోజుల్లో ఏడాదికి ఒకశాతం టీబీ మరణాలు నమోదవుతుండగా 2020-21 కొవిడ్‌ సమయంలో రెండుశాతం పెరిగాయి. 132 మంది మృతి చెందారు. ప్రస్తుతం మొండి క్షయకు ఔషధాలు వాడేవారు 75 మంది ఉన్నారు.

దాతల సాయంతో పౌష్టికాహార కిట్ల అందజేత

ఇవీ వ్యాధి లక్షణాలు

రెండువారాలు మించి దగ్గు, జ్వరం, గత మూడు నెలల కాలంలో పదిశాతం బరువు తగ్గడం, దగ్గినప్పుడు కళ్లెలో రక్తం పడటం వంటివి ఉంటే పరీక్ష చేయించుకోవాలి. మధుమేహంతో బాధపడేవారు.. పొగ, మద్యం తీసుకునేవారు, పోషకాహార లోపం, హెచ్‌ఐవీ బాధితులు, గనుల్లో పనిచేసేవారు, మురికివాడల్లో నివసించేవారికి వ్యాధిసోకే అవకాశం ఉంది.

ఎక్కడికక్కడ వివరాల నమోదు

మొండి క్షయతో బాధపడేవారికి ఒక్కొక్కరికి ఇచ్చే మందుల విలువ రూ.10లక్షలు. ప్రైవేటుగా కొనడం కష్టం. రోగం నిర్ధారణ అయిన వెంటనే ఔషధాలు వాడటం మొదలుపెడితే నివారణ సులభం. ఆరునెలలు ఇవి వాడకపోతే మళ్లీ మొదటి నుంచి కోర్సు ప్రారంభించాలి. రోగులను గుర్తించడానికి ప్రైవేటు ఆసుపత్రులు, ఔషధ దుకాణాల్లో మందులు తీసుకునేవారి పేర్లు, చరవాణి నంబర్లు నమోదు చేయాలని ఆదేశాలిచ్చాం.

డాక్టర్‌ సురేష్‌కుమార్‌, జిల్లా క్షయనివారణ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని