logo

నేర వార్తలు

కన్న తల్లిని హత్య చేసిన కేసులో నిందితుడైన కుమారుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు.

Published : 24 Mar 2023 03:49 IST

తల్లిని హత్యచేసిన కేసులో కుమారుడికి జైలు శిక్ష

మార్కాపురం నేర విభాగం: కన్న తల్లిని హత్య చేసిన కేసులో నిందితుడైన కుమారుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి. దోర్నాల మండలం హసనాబాద్‌కు  చెందిన నూనే దేవమ్మ, అచ్చయ్య దంపతుల కుమారుడు యోహాను. భార్య కుమారితో కలిసి యోహాన్‌ వేరుగా కాపురముంటున్నాడు.  అతను మద్యానికి బానిసై భార్యపై తరచూ దాడికి పాల్పడుతుండేవాడు. 2016 మార్చి 10న యోహాను భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేస్తుండగా, తల్లి దేవమ్మ అట్టుపడింది. సహనం కోల్పోయిన యోహాన్‌ కన్న తల్లిపై ఆయుధంతో దాడిచేయగా, ఆమె తీవ్రంగా గాయపడి వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దోర్నాల పోలీసులు యోహానుపై హత్య కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. మార్కాపురం ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి టి రాజావెంకటాద్రి సాక్షులను విచారించారు. నేరం రుజువు కావడంతో నిందితునికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు తెలిపారు. కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా దర్యాప్తు చేసిన అప్పటి సీఐ రవికుమార్‌, ఎస్సై నాగరాజు, సిబ్బందిని జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ఓ ప్రకటనలో అభినందించారు.


మహిళ హత్య కేసులో...:  ఒంగోలు గ్రామీణం: మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడటంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఎస్పీ మలికా గార్గ్‌ గురువారం అభినందించారు. 2022 జనవరి 27న కనిగిరికి చెందిన మువ్వా వెంకటలక్ష్మిపై అదే పట్టణానికి చెందిన పెరుబోయిన శివకృష్ణ కర్రతో దాడిచేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టి సాక్ష్యాధారాలు రూపుమాపిన సంఘటనలో పోలీసులు కేసు నమోదు చేయగా, సీఐ పాపారావు దర్యాప్తు చేశారు. నిందితుడికి జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి తీర్పు చెప్పారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ గార్గ్‌ అభినందించారు.


గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు

సింగరాయకొండ గ్రామీణం: గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.  సీఐ రంగనాథ్‌, ఎస్సై ఫిరోజా ఫాతిమా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం అలగాయపాలేనికి చెందిన కోడూరి రాములమ్మ పాత సింగరాయకొండ పరిధిలోని బాలిరెడ్డినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు గురువారం దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకుని 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆమె నుంచి వివరాలు రాబట్టి కందుకూరు పట్టణం శ్రీనగర్‌ కాలనీకి చెందిన కట్టా రంగయ్య, కట్టా కుమారి, కట్టా జీవన్‌కుమార్‌లను కావలి పట్టణం ఇందిరమ్మ కాలనీలో అరెస్టు చేశారు. వారంతా పాడేరు పరిసరాల నుంచి గంజాయిని తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి మరో 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  పట్టుబడిన మొత్తం గంజాయి విలువ సుమారు రూ.6 లక్షలుంటుందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని