logo

ఒంగోలులో ప్రమాణాల కంటే తక్కువగా గాలి నాణ్యత

ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి పట్టణాలు, నగరాల్లో వాయు కాలుష్య నియంత్రణకు కృషి చేయాలని... విజయవాడ జోనల్‌ అధికారి ఎన్‌వీ భాస్కరరావు పేర్కొన్నారు.

Published : 26 Mar 2023 02:16 IST

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జోనల్‌ అధికారి భాస్కరరావు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి పట్టణాలు, నగరాల్లో వాయు కాలుష్య నియంత్రణకు కృషి చేయాలని... విజయవాడ జోనల్‌ అధికారి ఎన్‌వీ భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులతో ఒంగోలు సరోవర్‌ హోటల్‌ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాంకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ సైతం కార్యక్రమం అమలును నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఒంగోలు, నెల్లూరు నగరాల్లో గాలి నాణ్యత జాతీయ ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నందున నాన్‌ అటైన్‌మెంట్‌ సిటీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. గాలిలో పీఎం10 సాంద్రతను తగ్గించేందుకు... రహదారులపై దుమ్ము, ధూళి లేకుండా నిత్యం శుభ్రం చేయాలన్నారు. గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చాలని సూచించారు. హరిత వనాలను పెంచాలని, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్రణ పోర్టల్‌పై కాలుష్య నియంత్రణ మండలి ఎన్‌సీఏపీ ప్రతినిధి నీలిమ అవగాహన కల్పించారు. ఎన్‌సీఏపీ భాగస్వామ్య విభాగాల బాధ్యతలను వివరించారు. ఒంగోలు, నెల్లూరు నగరపాలక సంస్థలకు విడుదల చేసిన నిధులను త్వరగా సద్వినియోగం చేసుకుని... ఆ వివరాలు పంపాలని కోరారు. లక్ష్యాలు చేరుకునేందుకు ఈ రెండు ప్రాంతాలకు ప్రోత్సాహక నిధులను సైతం కేంద్రం విడుదల చేసిందన్నారు. కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలోని గాలి నాణ్యత పెంచేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. నెల్లూరు కార్పొరేషన్‌ తరఫున డీఈ సురేష్‌ పాల్గొన్నారు. రవాణా, ట్రాఫిక్‌, పౌరసరఫరాలు, పరిశ్రమలు, విద్యుత్తు, వ్యవసాయ, గనుల శాఖల అధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని