logo

ముందు సంబరాలు.. ఆ తర్వాతే నగదు

నవరత్నాల అమలులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు మూడో విడత వైఎస్సార్‌ ఆసరా అమలు కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందులూరులో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి; జిల్లా స్థాయిలో ప్రకాశం భవన్‌లో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ప్రారంభించారు.

Published : 27 Mar 2023 04:09 IST

నేటి నుంచి వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమాలు
అన్ని మండలాల్లో నిర్వహణకు ఏర్పాట్లు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: నవరత్నాల అమలులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు మూడో విడత వైఎస్సార్‌ ఆసరా అమలు కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందులూరులో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి; జిల్లా స్థాయిలో ప్రకాశం భవన్‌లో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ప్రారంభించారు. ఏప్రిల్‌ 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ... ప్రతి రోజూ ఏదో ఒక మండల కేంద్రంలో ఆసరా సంబరాలు నిర్వహించేలా డీఆర్డీఏ, మెప్మా అధికారులు ప్రణాళిక రూపొందించారు. కార్యక్రమం తర్వాత రోజు సంఘాల ఖాతాలకు నగదు జమ చేసేలా షెడ్యూల్‌ అందించారు. ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో బ్యాంక్‌లకు సెలవు కావడంతో ఆ రెండు రోజులు విరామం ఇచ్చారు. 

* 3.59 లక్షల మందికి.. రూ. 280.50 కోట్లు...: స్వయం సహాయక సంఘాల మహిళలు 2019 ఏప్రిల్‌ 11 నాటికి తీసుకుని బకాయి ఉన్న బ్యాంక్‌ లింకేజీ రుణాలను వైఎస్సార్‌ ఆసరా పథకం కింద నాలుగు విడతల్లో రుణ మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పటికే గత రెండేళ్లుగా రెండు విడతల్లో కొంత జమ చేయగా.. తాజాగా మూడో విడతకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో కొన్ని మార్పులు చేసింది. అందుకు ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో మొత్తం 36,769 స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 3,59,506 మంది సభ్యులున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో బ్యాంక్‌ లింకేజీ ద్వారా తీసుకున్న రుణం మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు విడతల్లో జమ చేయనున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మూడో విడత కింద రూ.280.50 కోట్ల నగదును బ్యాంక్‌ ఖాతాలకు జమ చేయనుంది.

తీర్మానం చేస్తేనే జమ...

తొలి విడత రుణ మాఫీ అమల్లోనే సంఘాల వారీగా రుణ మొత్తం, మహిళల బ్యాంక్‌ పొదుపు ఖాతా వివరాల సేకరించి జమ చేశారు. అప్పట్లో కొన్ని సంఘాలకు చెందిన లీడర్లు.. తక్కువ మొత్తంలోనే జమ అయిందంటూ మిగతా మహిళలకు నగదు తగ్గించి ఇచ్చారు. దీంతో రెండో విడత అమలు సమయంలో మార్పు చేశారు. సంఘం ఖాతాలో పడిన నగదును తీర్మానం చేసుకుని ఇస్తే సభ్యురాలి వాటా ప్రకారం వ్యక్తిగత పొదుపు ఖాతాలో జమ చేసేలా బ్యాంకర్లకు అవకాశం ఇచ్చారు. ఈ సారి కూడా అదే తరహాలో వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాకు జమ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని