logo

అంతిమ యాత్రలోనూ అవే అసంతృప్తులు

వైకాపా కొండపి నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్‌బాబు తల్లి కోటమ్మ(82) అంత్యక్రియలను టంగుటూరు మండలం కారుమంచిలో సోమవారం నిర్వహించతలపెట్టారు.

Updated : 28 Mar 2023 05:06 IST

కొండపి నియోజకవర్గంలో ఆరని వర్గపోరు కుంపట్లు
సీఎం వచ్చినా హాజరవ్వని అసమ్మతి నాయకులు
ఈనాడు డిజిటల్‌, ఒంగోలు, న్యూస్‌టుడే, జరుగుమల్లి:

అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. చిత్రంలో కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, ఎస్పీ మలికా గార్గ్‌

వైకాపా కొండపి నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్‌బాబు తల్లి కోటమ్మ(82) అంత్యక్రియలను టంగుటూరు మండలం కారుమంచిలో సోమవారం నిర్వహించతలపెట్టారు. భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి  ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు దాదాపు అందరూ హాజరయ్యారు. సీఎం పర్యటన ముగిసే వరకు వేచి ఉండి అనంతరం కొద్దిసేపు ముచ్చటించుకుని వెళ్లారు. నియోజవకర్గంలోని అన్ని మండలాల నుంచి కార్యకర్తలూ తరలివచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ... అంతిమయాత్రలోనూ అసంతృప్తులు దూరంగా ఉండటం.. ఓ వర్గం నాయకులు హాజరు కాకపోవడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఆశించినదొక్కటీ.. అయినదొక్కటి...: కొండపి నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కొంతకాలంగా అధికార పార్టీని కలవర పెడుతూనే ఉన్నాయి. వర్గాలుగా విడిపోవడంతో పాటు ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి తరచూ ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. జిల్లా, రాష్ట్ర స్థాయిలోని ముఖ్య నేతలు ఎన్నిసార్లు పంచాయితీలు నిర్వహించినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోయింది. గత మూడేళ్లుగా ఇవే దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో వరికూటి అశోక్‌బాబు తల్లి కోటమ్మ అంతిమయాత్రకూ ఓ వర్గం దూరంగానే ఉండిపోయింది. వాస్తవానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వస్తుండటంతో అందరూ హాజరవుతారని.. పార్టీలోని అన్ని వర్గాలు ఏకం అవుతాయని, విబేధాలకు తెర పడుతుందని అధిష్ఠానం ఆశించింది. సీఎం పరామర్శ పర్యటన ప్రశాంతంగా ముగిసినప్పటికీ.. పార్టీ అధిష్ఠానం ఆశించిన విధంగా నియోజకవర్గంలో వర్గపోరుకు తెర పడకపోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.

పలకరింపునకూ రాలేదు...: సీఎం పర్యటన సందర్భంగా నియోజకవర్గంలో ఆరు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు కారుమంచికి వచ్చారు. అయితే ఇంతకుముందు బాధ్యుడిగా పనిచేసిన మాదాసి వెంకయ్య వర్గం మాత్రం ఎక్కడా కనిపించలేదు. టంగుటూరుకు చెందిన రాష్ట్ర కమ్మ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ బొడ్డపాటి అరుణ, రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షుడు బొట్ల రామారావు, రీజినల్‌ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, సహకార సంఘం అధ్యక్షుడు నిడమానూరు రమణారెడ్డి ఎక్కడా కనిపించలేదు. అలాగే వైకాపా వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భక్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, ఆర్టీసీ నెల్లూరు రీజినల్‌ ఛైర్‌పర్సన్‌ బత్తుల సుప్రజారెడ్డి, సింగరాయకొండ ఎంపీపీ కట్టా శోభారాణి, జడ్పీ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఎన్నాబత్తిన అరుణ కూడా హాజరు కాలేదు. రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పల్లెల నరసింహారెడ్డి, మర్పిపూడి జడ్పీటీసీ సభ్యుడు వెంకట్రావు, మర్రిపూడి సహకార సంఘం అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీపీ బోధ రమణారెడ్డి, కొండపి సొసైటీ ఛైర్మన్‌ బొక్కిసం ఉపేంద్ర చౌదరి, జరుగుమల్లి ఎంపీపీ బెల్లం నిర్మల, జడ్పీటీసీ సభ్యురాలు మాతంగి చంద్రలేఖ పర్యటనకు దూరంగా ఉండిపోయారు. కార్యక్రమం నిర్వహిస్తున్న కారుమంచి గ్రామంలోని వరికూటి అశోక్‌బాబు వ్యతిరేక వర్గానికి చెందిన నీరుకొండ సింగయ్య, సిరిపురపు భాస్కర్‌రెడ్డి, ఇతర నాయకులు కూడా రాలేదు.


పోలీసు వలయంలో కారుమంచి

వాహనంలోని ముఖ్యమంత్రి జగన్‌ను కంచెకు అవతల నిల్చుని చూస్తున్న గ్రామస్థులు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో కారుమంచి గ్రామాన్ని పోలీసులు సోమవారం తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. వైకాపా కొండపి నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్‌బాబు తల్లి కోటమ్మ మృతదేహానికి నివాళి అర్పించేందుకు సీఎం రానున్నారనే సమాచారం ఆదివారం మధ్యాహ్నం జిల్లా యంత్రాంగానికి అందింది. దీంతో పోలీసులు ఆగమేఘాల మీద బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు(అడ్మిన్‌) శ్రీధర్‌రావు(క్రైమ్స్‌), అశోక్‌బాబు(ఏఆర్‌)తో కలిసి ఎస్పీ మలికా గార్గ్‌ గ్రామంలో అదేరోజు పర్యటించి బందోబస్తు ప్రణాళిక రచించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలోని హెలిప్యాడ్‌తో పాటు సీఎం కాన్వాయ్‌ ప్రయాణించే మార్గాన్ని పరిశీలించారు. జిల్లాలోని 1,200 మంది సిబ్బందిని హుటాహుటిన కారుమంచి రప్పించారు. సీఎం కాన్వాయ్‌ సాగే మార్గంలో ఉన్న కాలనీలను పూర్తిగా బ్యారికేడ్లతో మూసేశారు. స్థానికులు ఎవరూ ఆ వైపు రాకుండా నిరోధించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


ఆవేదన తెలిపేందుకూ అడ్డగింతలు...

కారుమంచి గ్రామ యువత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

‘నలభై ఏళ్ల పాటు క్రికెట్‌ ఆడేందుకు వినియోగించుకుంటున్నాం. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మైదానంలా తీర్చిదిద్దుకున్నాం.. నాయకులు నమ్మకద్రోహం చేశారు. మా క్రికెట్‌ మైదానాన్ని మాకు కాకుండా చేశారు. సీఎం గారూ.. మీరైనా మాకు న్యాయం చేయండి. మైదానం దక్కేలా చూడండి’ అంటూ కారుమంచి గ్రామ యువత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి తమ ఆవేదనను నివేదించేందుకు ప్రయత్నించారు. క్రికెట్‌ మైదానాన్ని తాము తీర్చిదిద్దుకున్న తీరు, ప్రస్తుతం దాని దుస్థితిని తెలిపేలా ఛాయాచిత్రాలతో భారీ ఫ్లెక్సీ తయారుచేశారు. సీఎం కాన్వాయ్‌ సాగే మార్గంలో ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని చివరి నిమిషంలో గుర్తించిన బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు ఫ్లెక్సీ స్వాధీనం చేసుకుని పక్కనపెట్టారు. ప్రదర్శించేందుకు ప్రయత్నించిన యువకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు.

న్యూస్‌టుడే, ఒంగోలు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని