logo

ఒంగోలు పోస్టులపై పొరుగు కళ్లు

ఒంగోలు నగరంలో సీఐల నియామకంపై తలెత్తిన సందిగ్ధతకు ఇంకా తెర పడలేదు. ఇటీవల వరకు రెండో పట్టణ సీఐగా పనిచేసిన ఎన్‌.రాఘవరావు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి బదిలీ అయ్యారు.

Updated : 28 Mar 2023 04:47 IST

నేతల చుట్టూ పోలీసుల ప్రదక్షిణలు
భర్తీపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే:

ఒంగోలు నగరంలో సీఐల నియామకంపై తలెత్తిన సందిగ్ధతకు ఇంకా తెర పడలేదు. ఇటీవల వరకు రెండో పట్టణ సీఐగా పనిచేసిన ఎన్‌.రాఘవరావు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి బదిలీ అయ్యారు. తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి గ్రామీణ సర్కిల్‌కు బదిలీ కావడంతో ఈ పోస్టు కూడా ఖాళీ అయ్యింది. ఒంగోలు ఒకటో పట్టణ ఇన్‌స్పెక్టర్‌ను కూడా బదిలీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో జిల్లా కేంద్రంలోని మూడు స్టేషన్లకూ కొత్త సీఐలు వచ్చే అవకాశం ఉంది. ఈ పోస్టులపై పలువురి కళ్లు పడ్డాయి. వీటిని దక్కించుకునేందుకు ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న పలువురు సీఐలతో పాటు పొరుగునే ఉన్న గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి కూడా పలువురు అధికారులు పోటీ పడుతున్నారు. రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండటం, పలువురి నుంచి ప్రతిపాదనలు వెల్లువెత్తుతుండటంతో అధికారులకూ ఏంచేయాలో పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఎవరు మెరుగు అనే అంశంపై దృష్టి సారించారు. దీంతో ఒంగోలులోని స్టేషన్లలో ముఖ్యమైన పోస్టుల భర్తీపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. వీటిపై త్వరలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

గ్రామీణ సీఐగా శ్రీనివాసరెడ్డి..!: ప్రస్తుతం ఒంగోలు తాలూకా సీఐగా పనిచేస్తున్న వి.శ్రీనివాసరెడ్డిని ఒంగోలు గ్రామీణ సీఐగా బదిలీ చేస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ డాక్టర్‌ సి.ఎం.త్రివిక్రమ వర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. సుమారు నెల రోజులకు పైగా ఒంగోలు గ్రామీణ సర్కిల్‌ ఖాళీగా ఉంది. దీంతో సింగరాయకొండ సీఐ రంగనాథ్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానాన్ని శ్రీనివాసరెడ్డితో భర్తీ చేసినట్లైంది. ప్రస్తుతం జిల్లా పోలీసు కేంద్రంలోని ఐసీసీఆర్‌లో ఉన్న కె.వి.రాఘవేంద్రను పొదిలి సీఐగా, రేంజ్‌ వీఆర్‌లో ఉన్న ఎ.శివరామకృష్ణారెడ్డిని కనిగిరి సీఐగా నియమించినట్టు తెలిసింది. అక్కడ పనిచేస్తున్న యు.సుధాకర్‌రావు, బి.పాపారావులను వీఆర్‌కు పంపారు. దీనిపై మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని