logo

వాలంటీర్లకున్న విలువ సర్పంచులకు లేకపోయే

‘ప్రజల ఓట్లతో గెలిచిన తాము వారి సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం. పల్లెల్లో చిన్నపాటి అభివృద్ధి పనులు చేపట్టేందుకూ నిధులుండటం లేదు.

Published : 28 Mar 2023 02:09 IST

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: ‘ప్రజల ఓట్లతో గెలిచిన తాము వారి సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం. పల్లెల్లో చిన్నపాటి అభివృద్ధి పనులు చేపట్టేందుకూ నిధులుండటం లేదు. గ్రామ వాలంటీర్లకు ఉన్న విలువ కూడా మాకు లేకుండా పోతోంది’ అని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.శ్రీరామమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. సర్పంచులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ హక్కులను హరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తమ ప్రమేయం లేకుండానే నిధులను మళ్లిస్తున్నారని.. ఆపై విద్యుత్తు ఛార్జీలు, క్లాప్‌ మిత్రలకు జీతాలు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. చేసిన కొద్దిపాటి పనులకు కూడా సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. గ్రామ వాలంటీర్లకు ఉన్న విలువ కూడా లేకుండా పోయిందని.. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.రమేష్‌, రాష్ట్ర కోశాధికారి ఎస్కే.రసూల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని