logo

ఆ బంధానికి తీరిపోయెను రుణం

తమకున్న భూమిలో పంటలు సాగు చేసేందుకు ఆ వ్యక్తి తన భార్య పేరుపై బ్యాంకు రుణం తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో కాలం కలిసిరాకపోవడంతో సాగును వీడి వేరే చోటికి వెళ్లారు.

Updated : 28 Mar 2023 04:43 IST

భార్య నగదు చెల్లిస్తుండగానే భర్త మృతి
వేములపాడులో బ్యాంకు వద్ద విషాదం

వెంకటేశ్వర్లు (పాత చిత్రం)

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: తమకున్న భూమిలో పంటలు సాగు చేసేందుకు ఆ వ్యక్తి తన భార్య పేరుపై బ్యాంకు రుణం తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో కాలం కలిసిరాకపోవడంతో సాగును వీడి వేరే చోటికి వెళ్లారు. అయినా తీసుకున్న మొత్తం చెల్లించాలంటూ నోటీసులు అందాయి. రుణం తీర్చేందుకు వృద్ధ దంపతులిద్దరూ కలిసి వచ్చారు. భార్య కౌంటర్‌లో నగదు జమ చేస్తుండగా అక్కడే ఉన్న భర్త ఓ వైపునకు ఒరిగిపోయారు. అంతలోనే ప్రాణాలు వీడారు. ఈ విషాద సంఘటన హనుమంతునిపాడు మండలం వేములపాడులో సోమవారం చోటు చేసుకుంది. బ్యాంకు మేనేజర్‌ సంతోష్‌రెడ్డి తెలిపి వివరాల మేరకు.. హనుమంతునిపాడు మండలం మహమ్మదాపురానికి చెందిన చేబ్రోలు వెంకటేశ్వర్లు(65), తిరుపతమ్మ దంపతులు. వీరు కొంతకాలంగా గుంటూరు నగరంలో నివాసం ఉంటున్నారు. గ్రామంలో ఉండే సమయంలో వ్యవసాయం కోసం వెంకటేశ్వర్లు తన భార్య తిరుపతమ్మ పేరిట వేములపాడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో పంట రుణం తీసుకున్నారు. వయసు మీద పడిన ఆయన వ్యవసాయం వదిలి వేరే ప్రాంతానికి వెళ్లారు. తీసుకున్న రుణం చెల్లించాలంటూ బ్యాంకు నుంచి గతంలో నోటీసులు జారీ అయినప్పటికీ వెంకటేశ్వర్లు స్పందించలేదు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మార్చి ఆఖరులోపు వడ్డీ చెల్లించి రుణాన్ని రీ షెడ్యూల్‌ చేసుకోవాలని బ్యాంకు అధికారులు న్యాయస్థానం ద్వారా నోటీసు పంపారు. దీంతో గుంటూరులో నివాసముంటున్న వెంకటేశ్వర్లు తన భార్యతో కలిసి కారులో వేములపాడు బ్యాంకు వద్దకు వచ్చారు. ఆమె నగదు చెల్లించేందుకు కౌంటర్‌ వద్దకు వెళ్లగా.. సమీపంలోని బల్లపై వృద్ధుడు కూర్చున్నారు. తిరుపతమ్మ నగదు చెల్లిస్తున్న సమయంలో వెంకటేశ్వర్లు ఓ పక్కకు ఒరిగిపోయి పడిపోయారు. విషయం గుర్తించిన బ్యాంకు సిబ్బంది వెంటనే ప్రైవేటు వైద్యుడిని పిలిపించారు. ఆయన వచ్చి పరిశీలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు నిర్ధారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని