logo

డబ్బులిస్తారా! కోర్టు మెట్లెక్కించమంటారా!!

‘కారుకు రూ.ఏడు వేలు, పందెం పుంజుకు రూ.40 వేలు ఇవ్వండి. డబ్బులిస్తేనే వాటిని వదిలిపెడతాం.. లేదంటే కేసు కట్టి న్యాయస్థానంలో ప్రవేశపెడతాం. ఆ తర్వాత కార్లు తీసుకోవటం అంత సులభం కాదు.

Updated : 29 Mar 2023 12:58 IST

న్యాయస్థానానికి అప్పగిస్తే మీకే నష్టం
చర్చనీయాంశంగా ఓ పోలీసు వ్యవహారం

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ‘కారుకు రూ.ఏడు వేలు, పందెం పుంజుకు రూ.40 వేలు ఇవ్వండి. డబ్బులిస్తేనే వాటిని వదిలిపెడతాం.. లేదంటే కేసు కట్టి న్యాయస్థానంలో ప్రవేశపెడతాం. ఆ తర్వాత కార్లు తీసుకోవటం అంత సులభం కాదు. రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు విలువజేసే కోళ్లను కోర్టులో పెడితే మీకే నష్టం. అందుకే మేం అడిగినంతా ఇచ్చి తీసుకెళ్తారో.. లేదంటే న్యాయస్థానంలో ప్రవేశపెట్టమంటారో.. మీరే తేల్చుకోండి’ అంటూ జూదరులకు ఓ పోలీసు అధికారి హుకుం జారీ చేశారు. చేసేదేమీ లేక అడిగినంత చెల్లించి బయటపడ్డారు ఆ జూదగాళ్లు. ఈ ఉదంతం ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

దొరికిన పొరుగు జిల్లాల వాసులు...: జిల్లా కేంద్రానికి సమీపంలోని ఒక తీర ప్రాంత గ్రామంలో భారీస్థాయిలో కోడిపందేల శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం పోలీసు అధికారులకు అందింది. దీంతో జిల్లా కేంద్రం నుంచి ఒక అధికారి సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. పెద్దసంఖ్యలో కోళ్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జూదరులు పట్టుబడ్డారు. వీరిలో స్థానికులు మాత్రమే కాకుండా పొరుగు జిల్లాలకు చెందినవారు కూడా ఉన్నారు. పట్టుబడిన పందెంకోళ్లు, వాహనాలు, జూదగాళ్లను స్థానిక పోలీసులకు అప్పగించారు.

బేరసారాలకు తెర లేపి...: దాడి.. అప్పగింత అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆ పోలీసు అధికారి జూదరులతో బేరసారాలకు తెర లేపారు. దొరికిన కార్లను విడిచి పెట్టాలంటే ఒక ధర, కోడిని న్యాయస్థానంలో హాజరుపర్చకుండా ఉండాలంటే మరో ధర చెల్లించాలంటూ మాట్లాడారు. కారుకు రూ.ఏడు వేలు, కోడికి రూ.40 వేలు చెల్లిస్తేనే సంప్రదింపులుంటాయని, లేదంటే న్యాయస్థానంలోనే తేల్చుకోవాలంటూ హుకుం జారీ చేశారు. పట్టుబడిన వాటిని ఒక్కసారి కోర్టులో ప్రవేశపెడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకోవాలంటూ హెచ్చరించారు. పట్టుబడినవారిలో అత్యధికులు పొరుగు జిల్లాలవారు ఉండటంతో చేసేదేమీలేక అడిగినంత ముట్టజెప్పి కోళ్లు, కార్లను తీసుకెళ్లారు.

ఉన్నతాధికారుల అంతర్గత విచారణ...: తన చేతికి డబ్బులు అందడంతో దాడిలో పట్టుబడిన వాహనాల్లో సుమారు ఎనిమిదింటిని ఆ అధికారి పక్కకు తప్పించేశారు. కేవలం ఒక ట్రాక్టర్‌, ఒక ఆటోతో పాటు మరికొన్ని ద్విచక్ర వాహనాలు మాత్రమే దొరికినట్టు చూపారు. పట్టుబడిన పందెంకోళ్ల విలువ రూ. లక్షల్లో ఉండటంతో ఒక్కో దానికి రూ.40 వేలు వసూలు చేశారు. అనంతరం సాధారణ నాటుకోళ్లను కేసులో చూపి మమ అనిపించారు. ఈ మొత్తం ఉదంతంలో కీలకమైన కోడిపందేల శిబిరం నిర్వాహకుడిని కూడా మార్చి అతని స్థానంలో వేరొకరిని నిందితుడిగా చూపారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారడంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేశారు. ఆ అధికారి చేతివాటం నిజమేనని నిర్ధారించుకున్నట్టు తెలిసింది. త్వరలో అతనిపై చర్యలకు ఉపక్రమించనున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని