logo

వీర్ల కొండ ఎక్కేద్దాం.. నల్లమల చూసేద్దాం

సహజ అందాలకు నెలవు నల్లమల అడవులు. ఎతైన కొండలు, లోతైన లోయలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

Published : 30 Mar 2023 02:33 IST

సిబ్బంది పర్యవేక్షణలో కొండ పైకి చేరేందుకు వెళ్తున్న విద్యార్థులు

సహజ అందాలకు నెలవు నల్లమల అడవులు. ఎతైన కొండలు, లోతైన లోయలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో పర్యటించేందుకు ప్రకృతి ప్రేమికులు అమితంగా ఇష్టపడతారు. ఇటువంటి వారి కోసం అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పెద్దదోర్నాల- శ్రీశైలం నల్లమల రహదారిలోని తుమ్మలబైలు సమీపంలో వీర్ల కొండ ఉంటుంది. ఈ కొండపై వాచ్‌ టవర్‌ నిర్మించారు. కొండ పైకి చేరుకుని వాచ్‌ టవర్‌ పైనుంచి నల్లమల అటవీ ప్రాంతాన్ని తిలకించొచ్చు. తుమ్మలబైలు సమీపంలోని వీర్ల కొండ పైకి ఎక్కాలంటే రాళ్లలో సుమారు అర కిలోమీటర్‌ దూరం నడవాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వాచ్‌ టవర్‌ ఎక్కి చూస్తే పరిసర ప్రాంతాల్లోని చెంచు గిరిజన గూడేలు, శ్రీశైలం రహదారితో పాటు కనుచూపు మేర పచ్చదనంతో నిండిన ప్రాంతాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. పర్యాటకులను ఆ ప్రాంతానికి తీసుకెళ్లేందుకు అటవీ శాఖ ప్రత్యేకంగా అయిదుగురు సిబ్బందిని నియమించింది. వీరు తుమ్మలబైలు సమీపంలోని ఎకో టూరిజం వద్ద ఉంటారు. నల్లమలలో ఉండే వన్యప్రాణులు, ఔషధ మొక్కలు, జీవ వైవిధ్యం గురించి పర్యాటకులకు వివరిస్తారు. ఈ విషయమై పెద్దదోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. పర్యాటకులకు ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగా అటవీ, వన్యప్రాణుల సంరక్షణ గురించి వివరించడంతో పాటు నల్లమలలో సాగించే ఆహ్లాదకర ప్రయాణం జీవితాంతం గుర్తుండేలా వీర్ల కొండపై వాచ్‌ టవర్‌ నిర్మించి అటవీ అందాలను చూపిస్తున్నట్టు వివరించారు.

న్యూస్‌టుడే, పెద్దదోర్నాల

వీక్షణ కోసం పైభాగంలో నిర్మించిన వాచ్‌ టవర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని