logo

రానున్నది గొంతులు ఎండేకాలం

రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పైపైకి చేరుతున్నాయి. అందుకు అనుగుణంగానే నీటి ఎద్దడి ప్రాంతాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి.

Published : 30 Mar 2023 02:33 IST

11 మండలాల్లో నీటి ఎద్దడి
గుదిబండలా బకాయిలు

మూడు కిలోమీటర్ల దూరం నుంచి రిక్షాపై నీళ్లు తెచ్చుకుంటున్న పొదిలికి చెందిన వృద్ధుడు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పైపైకి చేరుతున్నాయి. అందుకు అనుగుణంగానే నీటి ఎద్దడి ప్రాంతాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. ఏప్రిల్‌, మే నెలలో మరింతగా ఉండే ప్రమాదముంది. దీంతో ఇటు ప్రజలు, అటు అధికార యంత్రాంగం కలవరపాటుకు గురవుతోంది. జిల్లాలో అత్యధికంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వై.పాలెం, పుల్లలచెరువు, పెద్దారవీడు ప్రాంతాల్లో ఇప్పటికే నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. మార్కాపురం, కొనకనమిట్ల, పొదిలి, తర్లుపాడు ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనిగిరి, పీసీపల్లి, పామూరు, వెలిగండ్ల, హెచ్‌ఎంపాడు ప్రాంతాలదీ అదే దుస్థితి. గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లోనూ కొన్ని గ్రామాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. జిల్లాకేంద్రం ఒంగోలులోని శివారు ప్రాంతాల వాసులకూ నీటి ఇక్కట్లు తప్పడం లేదు.

* పని చేయని పథకాలెన్నో...: జిల్లాలో 730 గ్రామ పంచాయతీల్లోని 1771 ఆవాస ప్రాంతాల్లో మొత్తం 17,297 తాగునీటి చేతిపంపులున్నాయి. ఇందులో చాలా వరకు బోర్లు ఎండిన పరిస్థితి. దాదాపు 2900 వరకు ఉన్న చిన్న, మధ్యస్థాయి రక్షిత పథకాల్లో 350కి పైగా పనిచేయడం లేదు. ఈ పరిణామాలతో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. కొన్నిప్రాంతాల్లో అయిదు, మూడు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. ఒంగోలు వంటి ప్రాంతాల్లో రాత్రి, వేకువజామున నీళ్లు ఇస్తున్నారు. ఆ సమయంలో పట్టుకోలేని వాళ్లు, అందుబాటులో లేని వాళ్లు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.

* బకాయిలతో గుత్తేదారుల బెంబేలు...: కుళాయి కనెక్షన్లు లేని ప్రాంతాలకు ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తుంది. వీటికి సంబంధించి 2020 నుంచి పెద్ద మొత్తంలో బిల్లులు బకాయిలున్నాయి. ఎంతకీ మంజూరు కాకుండటంతో కొన్ని ప్రాంతాల్లో గుత్తేదారులు సరఫరా నిలిపివేశారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో 76 గ్రామాలకు గాను అత్యధికంగా రూ.65 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా గతేడాది అక్టోబరు వరకు రూ.138 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి.

* ఎండిన బోర్లు 4,366...: ప్రస్తుతం 11 మండలాల్లో కొన్ని గ్రామాల్లో మాత్రమే తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ఏప్రిల్‌, మే, జూన్‌ నాటికి 12 మండలాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని అధికారుల అంచనా.

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఒంగోలు డివిజన్‌లోని పరిధిలో ఒంగోలు, సింగరాయకొండ, దర్శిలో మొత్తం చేతిపంపులు 8206 ఉంటే ప్రస్తుతం 7431 మాత్రమే పనిచేస్తున్నాయి. గిద్దలూరు, కనిగిరి, పొదిలి, వై.పాలెం ఉండే పొదిలి డివిజన్‌ పరిధిలో 9091 చేతిపంపులుంటే అందులో పనిచేసేవి 5500 మాత్రమే. ఇలా మొత్తం 4,366 బోర్లు ఎండిపోయాయి.. భూగర్భ జలాలు అడుగంటడంతో పూడికతీత పనులు చేసినా ఉపయోగం లేదంటూ చేసేదేమీలేక వీటి విషయంలో అధికారులు చేతులెత్తేశారు.

* ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం...: ప్రస్తుతం 11 మండలాల్లో నీటి సమస్య ఉంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సరఫరా చేస్తున్నాం. రానున్న రోజుల్లో 12 మండలాల్లోని 261 గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తవచ్చని అంచనా వేశాం. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌, జల వనరులు, రెవెన్యూ ఇతర విభాగాలతో కలెక్టర్‌ ఇటీవల సమావేశం నిర్వహించారు. సమస్యను ఎదుర్కొనేందుకు ఉమ్మడి ప్రణాళిక రూపొందించాం. యర్రగొండపాలెం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించాం. నీటి సరఫరా గుత్తేదారులకు సంబంధించిన బకాయిలపై ప్రభుత్వానికి నివేదించాం.

 మర్దన్‌ అలీ, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని