logo

చేస్తాం.. చూస్తామంటే కుదరదు

భూ సేకరణ పనుల్లో స్పష్టమైన పురోగతి చూపాలని, లేకుంటే క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ హెచ్చరించారు.

Published : 30 Mar 2023 02:33 IST

వీక్షణ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌,
మార్కాపురం ఉప కలెక్టర్‌ సేదు మాధవన్‌, డీఆర్వో శ్రీలత

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: భూ సేకరణ పనుల్లో స్పష్టమైన పురోగతి చూపాలని, లేకుంటే క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ హెచ్చరించారు. రెవెన్యూ అంశాలపై జిల్లా కేంద్రంలోని ప్రకాశం భవన్‌ నుంచి మండల, క్షేత్రస్థాయి అధికారులతో బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అలాకాకుండా చేస్తాం.. చూస్తాం అంటూ మొక్కుబడి సమాధానాలు చెబితే కుదరదని, పద్ధతి మార్చుకోకపోతే ఉద్యోగంపై ఆశ వదులుకోవాల్సిందేనని హెచ్చరించారు. బెంగళూరు- కడప- విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవేకు భూ సేకరణ పనుల్లో పురోగతిపై సమీక్షించారు. సీఎస్‌పురం మండలంలో నిర్దిష్ట పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ నిర్వాసితుల వివరాలతో కూడిన అవార్డులను ఈ నెలాఖరులోపు ప్రకటించాలని ఆదేశించినా ఎందుకు ఆ దిశగా చర్యలు చేపట్టలేకపోయారని డీటీని ప్రశ్నించారు. ఇదే విషయంలో కనిగిరి తహసీల్దార్‌ పనితీరు పైనా అసహనం వ్యక్తం చేశారు. భూ సేకరణ పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం నిర్వహించే వీక్షణ సమావేశానికి హాజరై స్వయంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఏప్రిల్‌ 15న జిల్లా అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. 10వ తేదీలోపు ప్రతిపాదనలను కలెక్టరేట్‌కు పంపాలన్నారు. సమావేశంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, మార్కాపురం ఉప కలెక్టర్‌ సేదు మాధవన్‌, డీఆర్వో శ్రీలత, సర్వే విభాగం ఏడీ గౌస్‌బాషా, డీపీవో నారాయణరెడ్డి, ఎస్‌డీసీలు శ్రీదేవి, గ్లోరియా, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు