logo

ఆవిర్భావ వేళ.. ఎగిరిన ఆత్మగౌరవ జెండా

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను జిల్లా అంతటా బుధవారం పండగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించారు.

Published : 30 Mar 2023 02:33 IST

ఒంగోలు: కర్నూలు రోడ్డులోని పైవంతెన వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి
నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను జిల్లా అంతటా బుధవారం పండగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించారు. ఒంగోలులోని జిల్లా, పార్లమెంట్‌ పార్టీ కార్యాలయాలతో పాటు, అన్ని డివిజన్‌ కేంద్రాలు, మండలాల్లో పార్టీ జెండా ఆవిష్కరించారు. కేకులు కోసి పంచి పెట్టారు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చిత్రపటం, విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్న పలువురు నాయకులు, కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. ద్విచక్ర వాహన ప్రదర్శనలు నిర్వహించారు. ఆయా చోట్ల నాయకులు మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లంటూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం చాటేందుకు ఆవిర్భవించిన పార్టీ తెదేపా అని కొనియాడారు. ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావుతో పాటు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కొండపి, మార్కాపురం, కనిగిరి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్‌ విగ్రహాలకు నివాళులర్పించారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ ఛైర్మన్‌ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

* హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెదేపా ఆవిర్భావ సభకు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తెదేపా ఎమ్మెల్యేలు డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌ పాల్గొన్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు ముత్తుమల అశోక్‌రెడ్డి, దివి శివరాం, ఒంగోలు పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, యర్రగొండపాలెం, కందుకూరు నియోజకవర్గాల బాధ్యులు గూడూరి ఎరిక్షన్‌బాబు, ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ హాజరయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని