logo

అవినీతిపై ఫిర్యాదు చేస్తే చంపుతామంటున్నారు

సింగరాయకొండ పంచాయతీ కార్యాలయంలో మూడేళ్లుగా చోటుచేసుకున్న అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినందుకు తనను చంపుతామంటూ వైకాపా నాయకులు బెదిరిస్తున్నారని జనసేన మండల అధ్యక్షుడు రాజేష్‌ అన్నారు.

Published : 30 Mar 2023 02:33 IST

సమావేశంలో మాట్లాడుతున్న రాజేష్‌.. పక్కన జనసేన నాయకులు

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: సింగరాయకొండ పంచాయతీ కార్యాలయంలో మూడేళ్లుగా చోటుచేసుకున్న అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినందుకు తనను చంపుతామంటూ వైకాపా నాయకులు బెదిరిస్తున్నారని జనసేన మండల అధ్యక్షుడు రాజేష్‌ అన్నారు. సింగరాయకొండలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంతో పాటు పంచాయతీలో సుమారు రూ. 14 లక్షల ప్రజాధనాన్ని దారి మళ్లించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు అందించినట్టు తెలిపారు. దీనికి స్పందించిన ఆయన అధికారులతో విచారణ చేయించారని.. బాధ్యులుగా గుర్తిస్తూ పంచాయతీ కార్యదర్శి శరత్‌బాబు, జూనియర్‌ సహాయకురాలు శైలజ, కంప్యూటర్‌ ఆపరేటర్‌ సురేష్‌లపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. విషయం తెలుసుకున్న వైకాపా స్థానిక నాయకులు తనపై కక్ష పెంచుకున్నారన్నారు. చరవాణిలో అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ముప్ఫై మంది వ్యక్తులు తన దుకాణం, ఇంటి వద్దకు వచ్చి దుర్భాషలాడారని ఆందోళన వెలిబుచ్చారు. తనకు ప్రాణహాని ఉన్నందున బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కందుకూరు రోడ్డు కూడలిలో జనసేన నాయకులు, కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్సై ఫిరోజ్‌ఫాతిమాకు ఫిర్యాదు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జనసేన పొన్నలూరు మండల అధ్యక్షుడు మనోజ్‌కుమార్‌, నాయకులు శ్రీనివాస్‌, చాన్‌బాషా, నాగరాజు, రాధిక, మాధురి, రజని తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు