logo

ఆంధ్రకేసరి వర్సిటీని తీర్చిదిద్దుతా

ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయాన్ని అన్ని విధాల తీర్చిదిద్ది ప్రత్యేక గుర్తింపు సాధించడానికి కృషి చేస్తానని ఉపకులపతి ఎం.అంజిరెడ్డి తెలిపారు.

Published : 30 Mar 2023 02:33 IST

 ఉప కులపతి అంజిరెడ్డి

మాట్లాడుతున్న ఉపకులపతి అంజిరెడ్డి, హాజరైన కళాశాల ప్రతినిధులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయాన్ని అన్ని విధాల తీర్చిదిద్ది ప్రత్యేక గుర్తింపు సాధించడానికి కృషి చేస్తానని ఉపకులపతి ఎం.అంజిరెడ్డి తెలిపారు. బుధవారం ఉమ్మడి ప్రకాశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్‌తో సమావేశం నిర్వహించారు. సీడీసీ డీన్‌ డాక్టర్‌ డి.వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లాకు విశ్వ విద్యాలయం రావడం ఏళ్ల నాటి కల అని, అది సాకారం అయిందన్నారు. త్వరగా నిధులు సమీకరించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఉప కులపతి మాట్లాడుతూ తాను ప్రకాశం వాసిగా యూనివర్సిటీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ బాధ్యతలు స్వీకరించానన్నారు. త్వరలో నిధులు సమకూర్చుకొని పేర్నమిట్ట వద్ద భవన నిర్మాణం చేపడతామన్నారు. అన్ని విభాగాలకు బాధ్యులను నియమించామన్నారు. త్వరలో యూనివర్శిటీ డెవలప్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని, దాతల సహకారం తీసుకుంటామన్నారు. జిల్లాలో ఆక్వా, మైనింగ్‌, అటవీ పరిశ్రమలు ఎక్కువుగా ఉన్నందున వాటిలో ఉద్యోగావకాశాలు పొందడానికి వీలుగా విభిన్న కోర్సులు ప్రవేశపెడతామన్నారు. పేర్నమిట్ట వద్ద నిర్మించిన భవనాల్లో అకడమిక్‌ బ్లాక్‌ ప్రారంభిస్తామని, ముందుగా అక్కడికి రహదారి సౌకర్యం కల్పిస్తామన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాలల గుర్తింపు విశ్వ విద్యాలయం ద్వారా ఇస్తామన్నారు. రిజస్ట్రార్‌ హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుతం విశ్వ విద్యాలయానికి స్థానికంగా మూడు రెగ్యులర్‌ బిల్డింగ్స్‌, మూడు షెడ్లు ఉన్నాయన్నారు. డీన్‌ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కళాశాల యాజమాన్యాల సహకారంతో త్వరగా అభివృద్ధి చేస్తామన్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డి.సోమశేఖర మాట్లాడుతూ ఏపీ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ వెలువడిందని, డిగ్రీ విద్యార్థులు ప్రవేశపరీక్ష రాసేలా యాజమాన్యాలు ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ హర్షప్రీతమ్‌దేవ్‌, కళాశాల యాజమాన్యాల సంఘం నుంచి బి.సూర్యనారాయణ, గుండా రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం ఉప కులపతిని సత్కరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు