logo

పదో తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు

మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ మలికా గార్గ్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

Published : 01 Apr 2023 04:12 IST

వీక్షణ సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మలికా గార్గ్‌

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ మలికా గార్గ్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి శుక్రవారం నిర్వహించిన వీక్షణ సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. జిల్లాలోని 175 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నందున వాటి వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మాస్‌ కాపీయింగ్‌ వంటి చర్యలకు ఆస్కారం లేకుండా అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సమీపంలోని జిరాక్స్‌ దుకాణాలను మూసివేయించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న అదృశ్యం కేసులకు సంబంధించిన దర్యాప్తును వేగవంతం చేయాలని చెప్పారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆదేశించారు. దర్యాప్తులో గ్రామస్థాయిలోని మహిళా పోలీసుల సహకారం తీసుకోవాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏక వరుస రహదారులపై రాత్రివేళల్లో కర్రల లోడు, పొగాకు, ఇతర భారీ వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ గార్గ్‌ ఆదేశించారు. మోసం కేసులపై సమగ్ర దర్యాప్తు చేసి బాధితులకు సకాలంలో న్యాయం చేసేలా చూడాలన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో 41ఏ నోటీసులకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్‌ నిర్వహించాలని, ఈ నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటించాలని ఆదేశించారు. వీక్షణ సమావేశంలో అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) ఎస్వీ.శ్రీధర్‌రావు, ఎస్‌బీ డీఎస్పీ మరియదాసు, మార్కాపురం డీఎస్పీ కిషోర్‌కుమార్‌, డీసీఆర్‌బీ సీఐ దేవప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని